Local Body Elections | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : స్థానిక ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కారు ముందడుగు వేసింది. బీసీ రిజర్వేషన్లపై వేర్వేరు జీవోలను జారీచేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసు మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో 9ని విడుదల చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీ, వార్డుసభ్యులు, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింప చేస్తూ వేర్వేరు జీవోలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం జారీచేసింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కోసం కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను పీఆర్ఆర్ఈ కమిషనర్, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీవోలు, వార్డుల సభ్యులు రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులో పేర్కొన్నారు.
రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలు జారీ అయిన క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. శనివారం సాయంత్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 31 జెడ్పీలు, 565 జెడ్పీటీసీలు, ఎంపీపీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.