హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆదాయం పెంచుకునేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ అడ్డదారులు తొక్కుతున్నదని, ఆయన పాలనలో ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 6 గ్యారెంటీలు, 420 హామీల అమలు ఊసే లేదని, కానీ, మద్యం ద్వారా ఆదాయం రెట్టింపు చేసుకునే దిశగా కొత్త పాలసీ తెచ్చారని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. కేసీఆర్ తెచ్చిన పథకాలకు కోతలు విధించి, ప్రజలకు పన్నుల వాతలు తప్ప.. ఈ 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. ఇప్పటికే మద్యం ధరలను ఇష్టానుసారంగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు కొత్త పాలసీని తెచ్చిందని ధ్వజమెత్తారు.
ఇపుడు మద్యం షాపుల దరఖాస్తు ఫీజును ఏకంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడమేమిటని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే మోసపు పనులతో ప్రజలను దగా చేస్తున్నారని విమర్శించారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ హామీని తుంగలో తొకి ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారేలా చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజలకు మద్యం తాగించడం, ఖజానా నింపుకోవడం అనే విధానాన్ని రేవంత్‌రెడ్ది సర్కార్ పాటిస్తున్నదని, అందుకోసం అన్నిరకాల మద్యంపై ధరలు పెంచిందని విమర్శించారు. మద్యం అమ్మకాలు టార్గెట్ రీచ్ కాలేదంటూ అధికారులకు మెమోలు ఇచ్చిన ఘనత ఈ రేవంత్ సరారుదేనని తెలిపారు. ఊరుకో మైక్రో బ్రూవరీ తెచ్చి, తాగుబోతుల తెలంగాణగా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. అడ్డదారులు తొకడం, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడటం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు.
‘ఈఎన్టీ’ నాలాకు మరమ్మతులు చేపట్టాలి
కోఠి ఈఎన్టీ దవాఖాన నాలాకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ‘బ్లాక్‌ఫంగస్’ వంటి మహమ్మారికి అద్భుతంగా సేవలు అందించిన దవాఖాన పరిస్థితి.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్వానంగా తయారైందని మండిపడ్డారు. దవాఖాన నాలాకు మరమ్మతులు చేయకపోవడంతో భారీ వర్షం పడిన ప్రతిసారీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి దవాఖానలోకి వరద రాకుండా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.