సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 26: రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ దవాఖానాను మురుగు ముంచెత్తింది. ఆస్పత్రి ఆవరణలో నెల రోజులుగా మురుగు ఏరులై పారుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఇదీ నగరం నడిబొడ్డున ఉన్న ప్రతిష్టాత్మక కోఠి ఈఎన్టీ దవాఖానా పరిస్థితి. చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి పొర్లి.. వార్డులు, దవాఖనా ఆవరణ పూర్తిగా మురుగుతో నిండిపోతోంది. పాతకాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈఎన్టీ దవాఖానాలో మురుగు నీటి నాలా పైకప్పు కుంగిపోవడంతో చిన్నపాటి వర్షానికే దవాఖానా వార్డులు, ఎమెర్జెన్సీ వార్డు పూర్తిగా మురుగుతో నిండిపోతోంది. నెల రోజులుగా ఇదే తంతు కొనసాగుతున్నా ఇటు జీహెచ్ఎంసీ అధికారుల్లో, అటు పాలకవర్గంలోనూ ఎలాంటి చలనం లేదు. రాత్రి కురిసిన వర్షానికి ఈఎన్టీ దవాఖానా పూర్తిగా మురుగు నీటితో జల దిగ్భంధంలోకి వెళ్లడంతో వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు రోగులు, రోగి సహాయకులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు.
గత కొంత కాలంగా దవాఖానాలో మురుగు నీరు ప్రవహిస్తున్న కారణంగా తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో వార్డుల్లో భోజనం చేయలేని దుస్థితి నెలకొందని పలువురు రోగులు, రోగి సహాయకులు వాపోతున్నారు. ప్రభుత్వ దవాఖానాలలో మెరుగైన వైద్యం లభిస్తుందని వస్తే.. ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త, మురుగుతో నిండిపోయి ఉండటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు వారాలకు పైగా దవాఖానాలో మురుగు పొంగి పొర్లుతోంది. దవాఖాన ప్రధాన గేట్ నుంచి క్యాజువాల్టీ మీదుగా మురుగు పెద్దెత్తున ప్రవహించడంతో ఎమెర్జెన్సీ పక్కనే ఉన్న వార్డుల్లోకి చేరుతోంది. దీంతో ఆ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు, రోగి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్, డీఎంఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
– డాక్టర్ ఆనంద్ ఆచార్య, సూపరింటెండెంట్, ఈఎన్టీ దవాఖాన, కోఠి