KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయఢంకా మోగించాలని పార్టీ సీనియర్ నేతలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. సర్వే రిపోర్టులన్నీ బీఆర్ఎస్దే గెలుపు అని సూచిస్తున్నాయని, ఆఖరికి కాంగ్రెస్ సర్వేలోనూ కారుదే విజయమని తేలిందని చెప్పారు. కాబట్టి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మెజార్టీ రావాలని సూచించారు. ఎర్రవల్లి నివాసంలో శుక్రవారం బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, పద్మారావుగౌడ్, సబితా ఇంద్రారెడ్డితో కేసీఆర్ సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతాగోపీనాథ్ను కేసీఆర్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలకు హైడ్రా పెనుభూతంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. పాలనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాలికి వదిలేసి, ఢిల్లీకి, ఇతర రాష్ర్టాలకు తిరుగుతున్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్‌నూ కలిసే ప్రయత్నం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని సబ్బండవర్ణాలను కలువాలని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుచేయాలని సూచించారు. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ప్రజల పాలిట ఎలా శాపంగా మారిందో వివరించాలని చెప్పారు. డివిజన్లవారీగా, విభాగాలవారీగా సీనియర్లను బాధ్యులుగా నియమించాలని సూచించారు. 2023లో మాగంటి గోపీనాథ్‌కు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇప్పుడు రావాలని ఆకాంక్షించారు. వివాదరహితుడు, క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు మాగంటి గోపీనాథ్ అని కేసీఆర్ గుర్తుచేశారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎంతో సేవ చేశారని, ఆ కుటుంబం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత తరుణంలో వారంతా అండగా నిలుస్తారని చెప్పారు. నగర నాయకులను అందరినీ కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు.