ఖమ్మం సిటీ, జూలై 8 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతాంగంతోపాటు అన్ని వర్గాల వారు ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఆశించిన మేర పంటలు సాగులోకి రాలేదని, దీంతో రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదన్నారు. వాతావరణ శాఖ నిపుణుల హెచ్చరికలను అనుసరించి రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఎల్‌నినోను కీలక సవాల్‌గా ప్రభుత్వం స్వీకరించాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులు, పంటల దిగుబడి, తాగునీటి కొరత, భూగర్భ జలాల క్షీణత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలన్నింటిపై తక్షణమే అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే తాగునీరు, సాగునీటి అవసరాలు, ప్రధానంగా నాగార్జున సాగర్, గోదావరి జలాలు, మున్నేరు, వైరా, పాలేరు, కిన్నెరసాని వంటివన్నీ వర్షాధారంపైనే ఆధారపడ్డాయని వివరించారు. ఉమ్మడి జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో జిల్లాస్థాయిలో ప్రత్యేక ఎల్‌నినో టాస్క్‌ఫోర్స్‌ను నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.