– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు
రాజాపేట, మార్చి 16 : గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని దూదివెంకాటాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామ సమస్యలను గ్రామ సభలోనే చర్చించి పరిష్కరించాలన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అధికారులు, ప్రజలు కలిసి పని చేయాలని సూచించారు.
అనంతరం మండలంలోని రేణికుంట గ్రామంలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ను ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పిల్లలకు పరిశుభ్రంగా, పోషకాహారంతో కూడిన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని పాఠశాల సిబ్బందికి సూచించారు. మంచినీటి సౌకర్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. అనంతరం గ్రామంలో నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం, సంరక్షణ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
మొక్కలను సక్రమంగా పెంచి గ్రామాల్లో విస్తృతంగా నాటే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. అదేవిధంగా రేణికుంట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన సేవలను త్వరితగతిన అందించాలన్నారు. ఈ నెల 31వ తేది లోపు వంద శాతం ఇంటి పన్ను ను వసూలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి కిషన్ ఉన్నారు.