ఖమ్మం, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలన చేపట్టిన 11 నెలల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం మొదలైందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యకార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో ఖమ్మం తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అని వర్గాల ప్రజల నుంచి ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకతను తెచ్చుకున్నది రేవంత్ ప్రభుత్వం మాత్రమేనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అల్లుడి ఫార్మా కంపెనీకి భూములను అప్పగించేందుకే లగచర్ల ప్రాంతంలో గిరిజన రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా 21న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ర్యాలీలో పాల్గొనేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నట్లు తెలిపారు.
అధికారం ఉన్నా, లేకున్నా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని బీఆర్ఎస్ నేతలు సండ్ర వెంకటవీరయ్య, లింగాల కమల్‌రాజు, కొండబాల కోటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ పేర్కొన్నారు. మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి మరో షాడో మంత్రిగా పనిచేస్తున్నారని ఆరోపించారు.