మధిర, నవంబర్ 24 : ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, కరువు భత్యం (DA) బకాయిలు, పీఆర్సీ (PRC), పెన్షనర్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ టీఎస్ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) ఖమ్మం జిల్లా శాఖ దీక్ష కరపత్రాల ఆవిష్కరణ ఉద్యమ బాట పట్టింది. ఈ 30 గంటల నిరాహార దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ పీఆర్టీయూ మధిర మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీవీఎం ఉన్నత పాఠశాల ఆవరణలో నిరాహార దీక్ష కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, ఆర్.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సర కాలం నుండి వందలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందారని, అయితే ఏడాది గడిచినా కూడా వారికి చెల్లించాల్సిన రిటైట్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా చెల్లించకపోవడం శోచనీయమన్నారు.
ఉపాధ్యాయులు దాచుకున్న జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ డబ్బులు, మెడికల్ బిల్లులు సైతం నెలలు గడిచినా విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. పీఆర్టీయూ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర నాయకత్వం, ప్రభుత్వానికి పదేపదే విన్నవించిన కారణంగా నెలకు రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయకపోవడం దురదృష్టకరం అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్లను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు. మధిర డివిజన్ నుండి కూడా ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షకు మద్దతు తెలియజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు ఎస్.కె.మదార్, డి.వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్.వి.రవికుమార్, మధిర మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి, పోలే సుధాకర్, నాయకులు కొలగాని ప్రసాదరావు, పిల్లి నరసింహారావు, కె.శాంత బాబు, ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు.