Harish Rao | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యంగా కుల వృత్తులకు సహకారం అందించడం నుంచి మొదలుకొని విద్యారంగంలో ఏర్పాటుచేసిన విద్యా సంస్థల వరకు బీసీ వర్గాలకు కేసీఆర్ చేసిన మేలును తెలంగాణలోని బీసీలు గుర్తుంచుకున్నారని, వారంతా కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు.
తెలంగాణ భవన్లో బీసీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్‌తో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్.. కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న మోసంపై ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని పార్టీ నేతలంతా ప్రజల్లోకి తీసుకువెళ్తారని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే పార్టీకి అందజేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.