HAL : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం (Tejas Fighter Jet) దుబాయ్ ఎయిర్ షో (Dubai air show) లో శుక్రవారం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో IAF పైలట్ (IAF pilot), వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ (Namansh Syal) మృతిచెందారు. సయాల్ మరణంపట్ల HAL కంపెనీ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ ప్రమాదాన్ని అసాధారణ పరిస్థితుల్లో సంభవించిన దుర్ఘటనగా అభివర్ణించింది.
మరోవైపు తేజస్ ప్రమాదంతో సోమవారం నాటి ట్రేడింగ్లో HAL షేర్లు భారీగా పడిపోయాయి. కంపెనీ షేర్లు సోమవారం ఉదయం ఎనిమిది శాతానికిపైగా పడిపోయాయి. అయితే ఈ ప్రమాదం తమ సంస్థ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, భవిష్యత్తు డెలివరీలపై ఎలాంటి ప్రభావం చూపదని హామీ ఇచ్చింది. అయినప్పటికీ బీఎస్ఈలో షేరు ఓ దశలో దాదాపు 8 శాతం తగ్గి రూ.4,205 వద్ద ట్రేడైంది.
ప్రమాదంపై విచారణ జరుపుతున్న ఏజెన్సీలకు తమపూర్తి సహకారం ఉంటుందని హెచ్ఏఎల్ తెలిపింది. అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయంలో వాటాదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని పేర్కొంది. ఈ తేజస్ యుద్ధ విమానం తమిళనాడులోని సూలూరు స్క్వాడ్రన్కు చెందినది. సుమారు ఎనిమిది నిమిషాలు విన్యాసాలు చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ విచారణకు ఆదేశించింది.