బోనకల్లు, నవంబర్ 24 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద పదవిలో ఉన్నప్పటికీ, ఆయన బుద్ధులు మాత్రం చిల్లరగా ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. దేశంలో దమ్మున్న ప్రభుత్వం కేరళలో ఉంటే, తెలంగాణలో కాంగ్రెస్ రూపంలో దద్దమ్మ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బోనకల్లు మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో సోమవారం సీపీఎం సీనియర్ నాయకులు దారగాని ఏడుకొండలు సంస్మరణ సభ కందికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పోతినేని తొలుత ఏడుకొండలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని అమలు చేయలేక కొట్టుమిట్టాడుతోందన్నారు.
భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలోనే అరాచకాలు పెరిగిపోయాయని, గోవిందాపురం(ఎల్) గ్రామంలో ఎరువులు పంపిణీ చేస్తున్న సొసైటీ సిబ్బందిపై, రైతులపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం దుర్మార్గమని అన్నారు. సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కిల్లారు సురేశ్, బంధం శ్రీనివాసరావు, జొన్నలగడ్డ సునీత, మాజీ సర్పంచ్ కొంగర వెంకటనారాయణ పాల్గొన్నారు.