మద్దూర్, ఆగస్టు 22 : కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల కేంద్రంలో పేదోడి ఇంటిపై బుల్డోజర్లు విరుచుకుపడ్డా యి. ఇప్పటికే ఒక సారి రోడ్డు విస్తరణ కోసం 50 ఫీట్లు కూల్చి వదిలేసి మరోసారి 72 ఫీట్ల విస్తరణ అంటూ పేదోడి గూడుపైకి బుల్డోజర్లు ఎగబడ్డాయి. ఇక ఈ కూల్చివేతలను మేము సహించబోమంటూ సామాన్యుడు ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్న దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ ‘రాజ్యమేలేటోడు కూలిపోను’ అంటూ సీఎం రేవంత్‌పై బాధితుడు కంటతడితో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభివృద్ధి చేస్తాడని ఓటేస్తే మా ఇళ్లనే కూల్చేస్తున్నాడంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాడు. ఇదంతా సీఎం రేవంత్ ఇలాకాలో జరగడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన యాదగిరిగౌడ్ పట్టణ చౌరస్తాలో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఇటీవల నాలుగు నెలల కిందట నారాయణ పేట – కోస్గి, మద్దూర్ – మహబూబ్‌నగర్ రోడ్డు విస్తరణ కోసం కూల్చివేతలు చేపట్టగా అభివృద్ధి కోసమే అంటూ 50 ఫీట్ల మేర అందరూ ఒప్పుకున్నారు. అప్పటివరకు అక్కడ విస్తరణ పనులు జరిపి మిగతా పనులను పూర్తి చేశారు. ఇక ఇళ్ల్లు కోల్పోయిన బాధితులు కూడా విస్తరణలో పోయిన దానిని వదిలేసి మిగిలిన ఇళ్లను తిరిగి నిర్మించుకున్నారు. నాలుగు నెలలుగా వారు ఉన్నదాంట్లో తమ పనులు తాము చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా అధికారులు మరోసారి శనివారం ఉదయం 72 ఫీట్ల మేర విస్తరణ చేస్తామంటూ బుల్డోజర్లతో చేరుకొని కూల్చివేతలకు దిగారు. ఇప్పటికే సర్వస్వం కోల్పోయి మిగిలిన దాంట్లో జీవనం కొనసాగిస్తున్న బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి.
సమాచారం లేకుండా విస్తరణ పేరుతో పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపుతారా? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అధికారులు తగ్గలేదు సరికదా ఇది ప్రభుత్వ నిర్ణయం కూల్చే తీరుతామంటూ తేల్చి చెప్పడంతో బాధితుడు యాదగిరి కూల్చిన స్తంభానికే ఉన్న వైరును గొంతుకు చుట్టుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోగా పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ఏం చేయమంటారు సార్.. ఉన్న ఇంటిని కూడా కూల్చేస్తే ఎలా బతాకాలని బాధితుడు నిలదీశాడు. అంతలా అభివృద్ధి చేయాలనుకుంటే మా సమాధులపై అభివృద్ధిని చెయ్యండంటూ రోదించాడు. ఇక అతడు ఎంతకీ వినకపోవడంతో అధికారులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి పని ఆపేసి అక్కడి నుంచి బుల్డోజర్లను వెనక్కి పంపించి వెళ్లిపోయారు.
రోడ్దు విస్తరణలో అధికారుల తీరు దారుణంగా ఉందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. కనీసం వారు చెప్పిన మాటపైన కూడా వారు నిలబడటం లేదు. ఒకసారి 50 ఫీట్ల మేర విస్తరణ అన్నారు. అప్పుడు కూడా ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లు కోల్పోయే బాధితులకు కనీస సమయం ఇవ్వకుండా బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. అందరు బాధితులు తీవ్రంగా ప్రతిఘటిస్తే తప్పా అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. సీఎం ఇలాకాలో అభివృద్ధి అంటే ఇళ్ల కూల్చివేతలు భూముల కబ్జా తప్పా మరే అభివృద్ధి జరగటం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. కూల్చివేతలే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకున్నట్లుందని ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కావాల్సిన అభివృద్ధ్ది పనులు చేయకుండా అవసరం లేనిపనులు చేస్తూ పబ్బం గడుపుతూ పాలననను గాలికొదిలేశారని ఆరోపించారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధలో ఆత్మహత్యాయత్నానికి యత్నించిన బాధితుడు యాదగిరి కుంటుంబాన్ని మాజి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. రోడ్ల విస్తరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకంపై బాధితులతో మాట్లాడి వారితో వివరాలు సేకరించారు. అధికారుల తీరుతో సర్వస్వం కోల్పోతున్న బాధితుడు యాదగిరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం సృష్టిస్తున్న ఈ అరాచకాన్ని చూస్తూ సహించబోమని, యాదగిరి కుటుం బ సభ్యులకు అండగా ఉంటామన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామంటూ యాదగిరిగౌడ్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. రెండు రోజులలో అక్కడికి వచ్చి సమస్యపై అధికారులతో మాట్లాడదామని బాధితుడికి హామీ ఇచ్చారు.