తల్లాడ/ఆర్మూర్‌టౌన్, ఆగస్టు 22 : పూర్తిస్థాయిలో యూరియా అందడం లేదంటూ ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గంగదేవిపాడులోని సొసైటీ కార్యాలయంలో 1,200 బస్తాల యూరియా నిల్వ ఉన్నప్పటికీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు యాప్‌లో పెడుతున్నామని ప్రచారం చేసి, చివరకు అప్లోడ్ చేయలేదని రైతులు మండిపడ్డారు. సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఒక్క బస్తా యూరియా కూడా అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య గురించి ఏఈవో, తహసీల్దార్‌కు వివరించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో శనివారం సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు.
యూరియా బస్తాలు అందించాలని, లేదంటే సొసైటీ పరిధిలోని రైతులను సమీకరించి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సరిపడా యూరియాతోపాటు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. యాప్‌లో యూరియా బుక్ కావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ధర్నాతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు వచ్చి వారికి సముదాయించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.