హైదరాబాద్ ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై నిజానిజాలను నిగ్గుతేల్చాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రిని లండన్ పర్యటనకు అనుమతించిన భారత ప్రభుత్వం.. అమెరికా పర్యటనకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి యూఎస్ఏలో అనధికారికంగా దేశ భద్రత, ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారనే విషయాన్ని భారత గూఢచార సంస్థలు ముందుగానే పసిగట్టాయా?’ అని సందేహం వ్యక్తంచేశారు. ‘రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో హార్వర్డ్ యూనవర్సిటీలో రూ.కోటి వెచ్చించి వారం రోజులు చదువుకొన్నారు.
అప్పుడు ఆయనతోపాటు ఫహాం ఖురేషీ, రోహిన్‌రెడ్డి, చామల ప్రైవేట్ విమానంలో ప్రయాణించినట్టు ఫొటోలు రిలీజ్ అయ్యాయి. ఓవర్సీస్ కాంగ్రెస్ పేరిట షెల్ కంపెనీల సమావేశంలో పాల్గొన్నారా? ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరిని కలిశారు? వారి తీరుతో దేశ భద్రత, సార్వభౌమాధికారానికి ముప్పు పొంచి ఉన్నదని భారత ప్రభుత్వం భావించిందా?’ అని ప్రశ్నించారు. సీఎం టూర్ షెడ్యూల్లో పేర్కొన్నట్టుగా విద్యాపరమైన ఒప్పందాల కోసం బోస్టన్‌కు వెళ్తుంటే అనుమతి నిరాకరించడం అన్యాయమని, అదే నిజమైతే పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. సీఎం అమెరికా టూర్ షెడ్యూల్లో ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశం అనుమానాలకు తావిస్తున్నదన్నారు.