కాంగ్రెస్ పాలనలో రైతు బతుకు పెనం మీద పేలపు గింజలా తయారైంది. కల్లబొల్లి కబుర్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు రైతును చూస్తేనే కన్నెర్ర చేస్తున్నది. రుణమాఫీ అడిగినోళ్లను ఉరికిచ్చి కొడుతున్నది. పథకాలు ఏవని నిలదీస్తే పగ సాధిస్తున్నది. రైతుల వీపులపై పోలీసు లాఠీలు ప్రతాపం చూపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అసలిది ప్రజా ప్రభుత్వమేనా? అనే సందేహం కలుగుతున్నది. మొన్న లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వమన్నందుకు తండాల్లో బీభత్సం సృష్టించింది. ఆర్ఆర్ఆర్ భూసేకరణ పేరిట రైతులను అరిగోస పెడుతున్నది. పోడు భూములపై కన్నేసి ఆదివాసీ బిడ్డలను గోడు మనిపిస్తున్నది. అడిగిన వెంటనే భూములు పొట్లం కట్టి ఇవ్వనందుకు అధికార మదంతో అనర్థాలు జరిపించింది. ఇక ఫార్మా క్లస్టర్ వద్దన్న రైతులపైనా ఇదే కక్ష. వీటన్నింటి వెనుక నయానా భయానా పేదల భూములను లాగేసుకోవాలనే భూ దాహం ఉందన్నది స్పష్టం. ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అంశం ఏమంటే సర్కారుకు మనవాళ్లు, పైవాళ్లు అనే లెక్కలు ఉండటం.
ఫార్మాలకు, హైవేలకు భూములు ఇవ్వనంటే కాఠిన్యంతో పేదలపై కత్తులు నూరుతున్న సర్కారు.. పెద్దల మీద కారుణ్యం చూపుతూ తన అసలు నైజం బయటపెట్టుకుంటున్నది. నగర శివారుల్లో పెద్దల భూములను కాపాడేందుకు రీజినల్ రింగురోడ్డును అష్టవంకరలు తిప్పుతున్నది. ఆ వంకరలకు భూమి ఇవ్వాలని పేద రైతులను తరిమితరిమి కొడుతున్న సర్కారు.. పెద్దల దగ్గరికి వచ్చేసరికి వారింటికి ప్రదక్షిణలు చేస్తున్నది, ‘మా మీద దయ ఉంచి మీ భూములు ఇవ్వండి’ అని పొర్లుదండాలు పెడుతున్నది. కేబీఆర్ పార్క్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేవలం 250 గజాల స్థలం ఇవ్వనంటే ఇవ్వనని భీష్మించుకు కూర్చున్న సీనియర్ నేత జానారెడ్డితో అధికారులు రాయబారాలు నడపడం చూస్తుంటే విస్మయం కలుగకమానదు. ఇదీ మాన్యులు, సామాన్యులు అంటూ విడగొట్టి చూసే కాంగ్రెస్ మార్క్ వివక్ష. ఈ తరహా వివక్ష మనకు హైడ్రా దాడుల్లోనూ కనిపిస్తుంది. పేదల ఇండ్లను రాత్రికిరాత్రే నేలమట్టం చేసే సర్కారు బుల్డోజర్లకు పెద్దల ఇండ్ల దగ్గరికి వచ్చేసరికి బ్రేకులు పడుతున్నాయి. రూపాయి రూపాయి పోగేసుకొని పేదలు కట్టుకున్న ఇండ్లను పిచ్చుక గూళ్లలా కూల్చేస్తూ అస్మదీయుల ఇండ్లకు మాత్రం అభయహస్తం ఇస్తున్నది. ముఖ్యనేత సోదరుడి ఇంటికి నోటీసులు అంటించిన ప్రభుత్వం పేదలపై మాత్రం పంజా విసిరింది. జంట జలాశయాల్లో ఉన్న మంత్రులు, అధికార పార్టీ నేతల ఫామ్‌హౌజ్‌లకు జలహారతులు పట్టిన హైడ్రా బీదలపై విరుచుకుపడింది. పేదలే టార్గెట్.. పెద్దలకు సెల్యూట్ అన్న ధోరణిలో సర్కారు వ్యవహరిస్తుందనడానికి ఇదే తార్కాణం.
ప్రజాపాలన పేరిట పదవులకు ఎక్కినోళ్లు ప్రజాపీడన సాగిస్తున్నారు. మార్పు అంటూ ఊదరగొట్టినోళ్లు ప్రజల ఓర్పును పరీక్షిస్తున్నారు. హక్కులకు దిక్కు లేకుండాపోతున్నది. నిరంకుశత్వం నిగిడి ఎగుస్తున్నది. అధికారం అండదండలతో పెత్తందార్ల గుత్తాధిపత్యపు ఫ్యూడలిజం రాష్ట్రంలో జడలు విప్పుతున్నది. దేశంలో నేపాల్ తరహా ‘ప్రజా తిరుగుబాటు’ రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెగ ముచ్చట పడుతున్నారు. అది దేశంలో ఏమోగానీ అసలు పోయి కొసరు మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో, ముఖ్యంగా తెలంగాణలో వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి!