నాని కథానాయకుడిగా రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. ఇందులో నాని ‘జడల్’ అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అగ్రనటుడు మోహన్‌బాబు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె మంచు లక్ష్మి ఇటీవల ఓ సినిమా వేడుకలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. బుధవారం మోహన్‌బాబు ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం మోహన్‌బాబుపై కీలక సన్నివేశాలను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. ఇందులో మోహన్‌బాబు, నాని మధ్య వచ్చే సన్నివేశాలు రోమాంఛితంగా ఉంటాయని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనేది ఇప్పటివరకూ బయటకు రాలేదు. జాన్వీకపూర్ ఇందులో కథానాయికగా నటించే అవకాశం ఉందనేది విశ్వసనీయ సమాచారం. సోనాలి కులకర్ణి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.కె.విష్ణు, సంగీతం: అనిరుధ్, నిర్మాణం: ఎస్ఎల్వీ సినిమాస్.