నైతిక విలువల పరంగా ఇంతకన్నా దిగజారడులే అనుకున్న ప్రతీసారి ముఖ్యమంత్రి రేవంత్ మనలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. ఒక్క నోటిఫికేషన్ వేయకున్నా 70 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పుకోవడం, కాళేశ్వరం కూలేశ్వరమైందని ఓ వైపు డప్పు కొడుతూ.. మరోవైపు అదే కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్‌కు తీసుకురావడం కోసం కాళేళ్వరానికి అనుబంధంగా కొత్త శంకుస్థాపనలు చేయడం ఆయన ‘నైతికత’కు ఉదాహరణ.
‘ఫిరాయింపులు ఎక్కడివి.. కాంగ్రెస్ కండువా కప్పినంత మాత్రాన కాంగ్రెస్ వాళ్లు అయిపోతారా..’ అంటూ కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రేవంత్ చేసిన దబాయింపులు ఆయన మాత్రమే పాటించగలిగిన నైతిక విలువలకు, రాజకీయాలకు పరాకాష్ఠ. పైగా, ఫిరాయింపు అం టే ఏమిటో, ఎక్కడా స్పష్టమైన అర్థం లేదని, ఇంటికి వస్తే అతిథులకు భోజనం పెట్టినట్లు, శాలువా కప్పి సత్కరించినట్టు, తనను కలవడానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాం గ్రెస్ కండువా కప్పామని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకో టి ఉంటుందా? తెలంగాణ ప్రజలు మరీ అంత అమాయకులని రేవంత్ భావిస్తున్నారంటే అది ఆయన తప్పు కాదు, ఆయనను సీఎం కుర్చీపైన కూర్చోబెట్టినవారిదే తప్పు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడు తూ.. ‘నేను ఏ పార్టీలో ఉన్నాను అనేది స్పీకర్ నిర్ణయిస్తారు’ అని చెప్తున్నారు. ఆయ న ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదా? కడియం అంత స్పృహలో లేకుండా ఉన్నా రా? ఓ వైపేమో రేవంత్ ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిస్తే వాళ్లకు మర్యాద కోసం కాంగ్రెస్ కండువా కప్పినం తప్పితే ఇంకేం లేదు. వాళ్లంతా బీఆర్ఎస్లోనే ఉన్నారు’ అని చెప్తున్నారు. ఇంకో వైపేమో కడియం శ్రీహరి ‘నేను ఏ పార్టీ అనేది స్పీకర్ చెప్తారు’ అంటున్నారు. అంటే, సీఎం రేవంత్.. కడియం సహా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘మీరు మా పార్టీ మనుషులే కాదు’ అన్నా కూడా, స్వయంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియమే తనను తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అని చెప్పలేకపోతున్నారు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఎలా ఎన్నికైనట్టు. స్వతంత్ర అభ్యర్థిగానా?
సీఎం రేవంత్ చెప్పినట్టు, కండువా కప్పుకొంటే వారి శాసనసభ సభ్యత్వం రద్దవుతుందని పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు కానీ, తాము గెలిచిన పార్టీకి వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే అది ఫిరాయింపు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.
సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నడవడిక హుందాగా ఉండాలి. అనర్హతపై మీడియా అడిగినప్పుడు ఆ అంశం స్పీకర్ పరిధిలోని అంశమని చెప్పి ఊరుకోవచ్చు. అలా ఊరుకుంటే ఆయన రేవంత్ ఎం దుకవుతారు? పైపెచ్చు ఎమ్మెల్యేల అనర్హతపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పానని కూడా మీడియాతో అన్నారు. అంటే, సుప్రీం ఆదేశాలు ఇచ్చినా కదలని స్పీకర్.. నేను చెప్తే చేస్తా డు చూడు అని ఆయన సంకేతాలివ్వదలచుకున్నారా? ఏమో కానీ కడియం, రేవంత్ మాటల్లోని అంతరార్థాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగుతూ తన ను ఎవరూ చూడటం లేదన్నట్టున్నాయి వీళ్ల మాటలు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ మేం బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం ఈ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ కండువా కప్పి మరీ వాళ్లు బీఆర్ఎస్ వాళ్లే అని చెప్పడం రేవంత్‌కే సాధ్యమైన వికట రాజకీయం.
ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారడం కొత్త కాదు. తమ నియోజకవర్గ అభివృద్ధి అనో, సొంత ప్రయోజనాల కోసమే ప్రజాప్రతినిధులు పార్టీలు మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, అనర్హతకు సంబంధించిన అంశం ముందుకు వచ్చినప్పడు ఈ రకమైన వ్యాఖ్యానాలు ఇదే మొదటిసారి. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకొని రాజకీయాలు చేయగల ఉద్ధండులు పుట్టుకొస్తారని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించినప్పుడు శాసనకర్తలు ఊహించి ఉండరు. అందుకే, పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నా, పార్టీ విప్‌ను ధిక్కరించినా వారి శాసనసభ, పార్లమెంట్ సభ్యత్వం రద్దవుతుందని నిబంధనల్లో రాశారు.
ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే చట్టానికి, రాజ్యాంగానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నది. చట్టంలోని ఈ లొసుగును గుర్తించిన రేవంత్ ఈ రకంగా చరిత్రలో తప్పక నిలిచిపోతారు. అయితే, సీఎం రేవంత్ చెప్పినట్టు, కండువా కప్పుకొంటే వారి శాసనసభ సభ్యత్వం రద్దవుతుందని పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు కానీ, తాము గెలిచిన పార్టీకి వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే అది ఫిరాయింపు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. బహుశా ఇది సీఎంకు తెలిసి ఉండదు. లేదా ఆయనకు ఎవరూ చెప్పి ఉండరు.
ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అధికారికంగా తాను గెలిచిన పార్టీకి రాజీనామా చేయకపోయినప్పటికీ, అతని ప్రవర్తనను బట్టి పార్టీ సభ్యత్వాన్ని వదులుకొన్నాడా.. లేదా అనేది న్యాయస్థానాలు నిర్ణయించవచ్చని జేడీయూ ఎంపీలు శరద్ యాదవ్, అలీ అన్వర్‌లకు సంబంధించిన కేసులో పేర్కొన్నది. తాము గెలిచిన పార్టీపై బహిరంగ విమర్శలు చేసినా, వేరే పార్టీకి మద్దతు తెలిపినా.. ఆ సభ్యులు రాజీనామా చేసినట్టుగానే పరిగణింపబడతారని అనేక కేసుల్లో వ్యాఖ్యానించింది. మరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోడం అనేది బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమమా, కాదా? చూద్దాం. గౌరవ స్పీకర్‌కు ఏం అనిపిస్తుందో..?
– (వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
ఓ.నరసింహారెడ్డి 80080 02927