కాదా మరి..! ఎంత చేస్తున్నరు. ఎంతగనం నెట్టుకొస్తున్నరు. ఒక్కటా, రెండా.., తలకు మించిన బరువులు మోయలేక, చెయ్యక తప్పక లాగుతూనే ఉన్నరు. అంతా కలిసుండాలని, ఎల్లవేళలా తలుసుకుంటూ గడపాలని, ఎక్కడున్నా మీ తలపే ఉండాలని, ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలా చేయడానికి మీరు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదాయే. కుటుంబం అనేది ఇడ్సిపెట్టి, మీ అనే వాళ్లను పక్కనపెట్టి, ఆ మాటకొస్తే మీకు సంబంధించినవన్నీ వదిలేసి ఎప్పుడు జూడు.. జనం.. జనం.. జనం… అంటూ వాళ్ల కోసమే కాలమంతా ఖర్చు జేస్తున్న మీరు కారణజన్ములే. మీ కష్టం ఎవ్వరూ పట్టించుకోవడం లేదుగానీ., నిజంగా ప్రపంచంలోనే లేని ఏదైనా గొప్ప గుర్తింపు ఇవ్వాల్సినంత పెద్ద శ్రమజీవికి దక్కాల్సిన గౌరవం గిదా..? మేధావులంతా ఆలోచించాలె. మనిషన్నవాడు కనీసంగానైనా సోయితో సూడాలె!
అందరినీ రోడ్డుపైకి తేవడమంటే మాటలా..? ఎవ్వరినీ వదలమని చెప్పి మరీ చేస్తున్న తీరు అంత తేలికా? రుణం తీర్చుకోవడానికి, నమ్మి గద్దెనెక్కించినందుకు మీరు చేస్తున్న తీరు అమోఘం. మీరు అనుసరిస్తున్న విధానం అత్యద్భుతం. గంపెడాశలు కాదు, కోటి ఆశలతో మిమ్ముల కొలువులో కూర్చోబెట్టిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మీ వంతుగా పంచుతున్న ఆ అనుభవాలను ఎంత చెప్పినా తక్కువే. దానిగురించి ఎంత రాసినా ఒడ్వనిదే. చెప్పినవి చేయడం రొటీన్, చెప్పకుండా, ఎవ్వరూ చేయడానికి కూడా సాహసించని వాటిని.., కలలో కూడా ఊహించకుండా వణుకు పుట్టించేలా చేయడమనేదే వెరైటీ. మీరు అది చేస్తున్నారు. దానికి హాట్సాఫ్.
ఎలా ఇవ్వడం అనేది కాదు, ఇగో ఇస్తాం, అగో ఇస్తామని మాటలతో పూట గడుపుతున్న మీ లౌక్యం వీళ్లకు ఎలా తెలిసేదయ్యా? ఏ.. గత ప్రభుత్వం ఇచ్చినంత మాత్రాన ఇవ్వాలని రూలా? వాళ్లు చేసిన పనులను యథావిధిగా మీరు చేయాలనే నిబంధనా?
లేకపోతే ఏంటండి. మహిళలు దేవాలయం దగ్గరో, లేదంటే మైదానంలో.. అదీ కాదంటే చెరువు గట్టుమీదనో బతుకమ్మ ఆడటం రొటీన్, అలాంటివారిని అంతా యూరియా బస్తాల కోసం దుకాణాల ముందుకు చేర్చిన ఘనత అంత మామూలుదా? పండుగ వేళ పిల్లాపాపలతో గడుపుతూ, పోరగాండ్లకు నాలుగైదు అప్పతునకలు చేసిపెట్టి బాయికాడనో, ఇంటిముందో కూర్చొని తినే విధానం రొటీన్. అప్ప తునకలు కాదు కదా, కనీసం పండుగపూట ఇచ్చిన సెలవుల్లో పిల్లలు ఇంటికొస్తే నచ్చింది వండిపెట్టేందుకు కూడా సమయం లేనంత బిజీగా ఆడోళ్లను బస్తాల కోసం లైన్లో నిలబెట్టిస్తున్న తీరు మహాద్భుతం. కూలీ పనుల్లో గడియ రికాం లేకుండా గడపాల్సిన పని సమయంలో అమ్మలక్కలంతా హాయిగా దుకాణాల ముందు మందు బస్తా దొరుకుద్దో లేదో అని టెన్షన్ టెన్షన్‌గా గడిపేలా కల్పించిన ఆ వాతావరణం మరీ వెరైటీ. పనులు తప్ప మరేమీ తెలియకుండా, ఒకరంటే ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ గడిపే గ్రామీణ మహిళలు మాయదారి మందు బస్తాల కోసం సిగలు పట్టుకొని తన్నుకునేలా చేసిన ఏర్పాట్లు అబ్బో.. న భూతో న భవిష్యత్తు. ఇంత చేస్తున్నా మీ గురించి మెచ్చుకోకపోగా తిడుతున్నారు చూడండి.. ఎంత ఘోరమండి!
ఇగ పండుగ పూట సరిపడా బస్సులు ఏర్పాటుచేయకుండా బస్టాండ్లలో గంటల తరబడి ఎదురుచూసేలా చేసి, అంతా ఒకరికొకరు ముచ్చట్లతో కాలం గడిపేలా ఆటవిడుపు కల్పిస్తున్న మీ ముందుచూపును ఎంత మెచ్చుకున్నా తక్కువే. రాక రాక బస్సొస్తే అందులో ఎక్కడానికి మల్లగుల్లాలు పడేలా ఫీజు తీసుకోకుండా మల్లయుద్ధాన్ని నేర్పిస్తున్న తీరు ఇంకెంత మంచిదో కదా! బస్సు ప్రయాణం అంటేనే దడుసుకొని, ఎవరికి తోచినవిధంగా వాళ్లు పోవాలని చేస్తున్న మీ దూరదృష్టికి నిజంగా నీరాజనాలు అర్పించాల్సిన జనాలు, ఇలాంటి సందర్భాన్ని గుర్తించకపోవడమే అతి దారుణం.
ఆడపడుచులంతా కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా బతుకమ్మ ఆడుకోవాల్సిన వేళ ఇండ్లు కూల్చకండి మహా ప్రభో అని అర్థించేలా చేస్తున్న తీరుకు మీకు ఎంత ధైర్యం కావాలి. రాజధాని అంతా ఊర్లకు ప్రయాణమవుతున్న వేళ, ఎక్కడ ఇండ్లు కూల్చేస్తారో అనే టెన్షన్‌తో కొందరు ఇంటినే పట్టుకొని వేలాడేలా చేస్తున్న తీరు ఇంకా హైలైట్. కడుపు మండి బతుకమ్మను రోడ్డుపైనే ఆడేలా, గౌరమ్మను గొడగొడ ఏడ్చేలా, ఇండ్లు లేకుండా పిల్లలతో వీధుల్లోనే పండుకునేలా కల్పించిన పండుగ పూట ఈ ఏర్పాట్లను ఏ ఒక్కరూ అర్థం చేసుకున్న పాపాన పోవడం లేదు. పేదల విషయంలో మడమ తిప్పనిదిగా, పెద్దల దగ్గరికి వచ్చేసరికి చూసీ చూడనట్టుగా వ్యవహరించేలా హుకూం జారీ చేసిన మీ దీర్ఘదృష్టిని పొగడాలంటే పదాలు రావడం లేదండి బాబూ. ఇంతా చేస్తున్నది మీ ఇంట్లోకా అనే సోయి లేకుండా అటు హైడ్రాను, ఇటు మిమ్మల్ని తిట్టిపోయడం ఎంత ఘోరమండి? ఇలాంటి ఘనకార్యాల గురించి చెప్పుకోవడానికి మీకేమో మొహమాటం అడ్డొస్తున్నది. మీవాళ్లకేమో మరేదో కాలొడ్డుతుంది, ఇదంతా ఏందో ఎప్పటికీ అర్థం కాని వ్యవహారంగా మిగిలిపోతున్నది!
పెరుగుట విరుగుటకే. విరుగుట పెరుగుటకే. అనేది తెల్వకుండా కూలగొడ్తున్నరని ఏడ్వటం ఎందుకో తెలుస్తలేదు. మీరు చిన్న చిన్న వాళ్లది కూలగొట్టి పెద్ద పెద్ద సౌలతులు కల్పించి, బడా బడా కంపెనీలను రప్పించి బతుకుదెరువు చూపెట్టేందుకు గాదా ఏంది? పేదోడికి నిల్వ నీడ లేకుండా చేస్తే ఎలా బతుకాలో కసిగా తీసుకొని కొత్తగా ఆలోచిస్తాడని ఇంత చేస్తుంటే జనాలకు ఎందుకు అర్థం కావడం లేదో? ఎంతసేపూ అంతా కలిసి పాపం మిమ్మల్ని తిట్టిపోసుకోవడమే తప్ప మీ పనుల వెనక మర్మాన్ని ఎందుకు గమనించడం లేదు? ఏదైనా చేద్దామంటే పలుకుబడి ఉపయోగించి మోకాలడ్డే పెద్దలను వదిలేసి, ఏమీ చేసినా కడుపు బాదుకుంటూ, నెత్తినోరు కొట్టుకునే జనాల్నే రాచిరంపాన పెడుతున్నట్టు నడుచుకుంటున్న మీ తీరును, అమాయకపు ప్రజలు ఎందుకు తప్పుబడుతున్నారో తెలియడం లేదు. సర్కార్ చేస్తున్న ఘనకార్యాన్ని శాపనార్థాలతో కడిగిపారేస్తున్న జనం తీరే మనస్సును కకావికలం చేస్తున్నది.
ఇగ చీరల ముచ్చట గురించి ఎంత చెప్పుకొన్నా ఒడ్వది. గత సర్కార్ ఇచ్చింది బోడి రంగురంగుల చీరలని ఆడిపోసుకున్న మీరు పట్టుపితాంబరాలో, మరేదో ఇవ్వడానికి ప్రణాళికలు చేస్తున్న తీరును ఎవ్వరూ గమనించడం లేదు. ఏడాది పోతేంది, రెండేండ్లు గడిస్తేంది, ఇంకో మూడేండ్లు ముందరున్నది కదా, కనీసం అందులో ఒక్కఏడాదైనా ఇవ్వకపోతరా? అప్పటి దాక కూడా ఆగకుండా, ఏదో కొంపలంటుకున్నట్టుగా, కోకలు మూటగట్టుకున్నట్టుగా గగ్గోలుపెడుతున్న వీళ్లను ఏమనాలి? ఎలా ఇవ్వడం అనేది కాదు, ఇగో ఇస్తాం, అగో ఇస్తామని మాటలతో పూట గడుతున్న మీ లౌక్యం వీళ్లకు ఎలా తెలిసేదయ్యా? ఏం.. గత ప్రభుత్వం ఇచ్చినంత మాత్రాన మీరు ఇవ్వాలని రూలా? వాళ్లు చేసిన పనులను యథావిధిగా మీరు చేయాలనే నిబంధనా? మీ స్వతంత్రం మీకు లేదా? ఉట్టిగనే ఎలచ్చన్ల ఎన్నికైండ్రా ఏంది? అనుభవించినంత అనుభవించడానికి మీకు అర్హత లేదా?
అయినా మీరు చేయనని చెప్తున్నరా? మీకు ఓ కమాండ్, అది హస్తిలో కూర్చుంటది, ఏది చెయ్యాల్నన్నా దాని పర్మిషన్, దాన్ని కల్వడానికి మీకు సమయముండాలి. అది సమయమివ్వాలి. ఇప్పటికే మీరు ఆ పని, ఈ పని అంటూ అర్ధ సెంచరీకి పైగా ఢిల్లీ పోతిరి, వస్తిరి. గిదేమన్న మీ ఇష్టమున్నట్టుగా నడ్సేదా ఏంది? పైగా మీరేమైనా పనీపాటా లేకుండా ఉత్తగనే తిరిగేటందుకు మీరు తిరుగుబోతులా? మీ వంతుగా తిరగాల్సింది తిరుగుతున్నరు. కలవాలని ఉబలాటపడుతున్నరు. మిమ్మల్ని దూరం పెట్టి, కల్వకుండా దాక్కుంటే వాళ్ల బ్యాడ్‌లక్, ఇటు జనాల దౌర్భాగ్యం తప్ప మీరేం చేస్తారు మహానుభావా?
జనమంతా రోడ్లెక్కి, ఒకరినొకరు తిట్టుకుంటూనో, కొట్టుకుంటూనో.. ఎలాగైతేనేం.. అంతా కలిసి గడిపే సౌలత్ కల్పించిన మీ తీరు అందరూ అర్థం చేసుకోదగినది. యూరియా కోసమైతేనేం, హైడ్రా భయకంపితం కావొచ్చు గాకా, విద్యావిధానాలపై మీ వంతు నియంతృత్వపు పోకడలైనాఅవ్వనివ్వండి. గ్రూప్ వన్ వ్యవహారంలో మీ లోపమైనా కావచ్చు, హాస్టళ్ల సౌకర్యాల లేమి అయ్యుండనీ గాక, అందని పింఛైన్లెతే మరీ మంచిది.
నీళ్లిడ్వని కాల్వల్లో మెలిసిన గడ్డి సాక్షిగా పంటలు వెనక్కి వస్తే ఏమి? బెస్ట్ అవైలబుల్ నిధులు విడుదల కాక పిల్లలూ మీరిక ఇంటి దగ్గరే ఉండొచ్చు అని పాఠశాలల హుకుం అయితేనేం, ఎదురుతిరిగినా, ఏదైనా కావాలని అడిగిన వారికి పార్టీ రంగులు పూసి కటకటాల్లోకి నెట్టడం అయితేనేం, రియల్ ఢమాల్ చేస్తేనేం, కాళేశ్వరం కూలుతుందని చెప్పి, మళ్లీ దానికే కొనసాగింపుగా కొత్త శంకుస్థాపనలు చేస్తేనేం, నగరం నుంచి తరలిపోయే కంపెనీల విషయమైతేనేం, ఎన్నైతేనేం.., ఎంతైతేనేం… ఏదైతేనేం… మీ వల్ల చేయాల్సినవన్నీ చేస్తున్నారు., చూపించాల్సిందంతా చూపుతున్నారు. ఇంతకన్నా చేయడానికి మీకు రెండు చేతులు కాక ఎక్కువేమైనా ఉన్నయా?
మీరు మానవ మాత్రులు కాక అతీతులేమైనా అవుతారా? ఇన్ని తీర్లుగా చేసుకుంటూ సబ్బండవర్ణాలు సడక్ మీదికి వచ్చేలా చేస్తున్న మీ పట్టుదలకు శతకోటి వందనాలు. ఎవ్వరు ఎన్ని చెప్పినా, జనమెంత తిట్టుకున్నా పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకెళ్తున్న మీ తీరుకు జోహార్లు. అనుకున్నయన్నీ చెయ్యాలె? అందరినీ రోడ్డెక్కించాలె! మీరు సల్లగుండాలి. మీరు బతుకమ్మ వేళ ఆ అమ్మ దీవెనలతో మరింత సల్లంగుండాలె.
– రాజేంద్రప్రసాద్ చేలిక 9985835601