ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారాలను తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను, ఏడాదికి 30మందికి చొప్పున మొత్తం 90మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. వారిలో ప్రముఖ కథానాయిక సాయిపల్లవి, ఎస్.సూర్య, సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా ఉండటం విశేషం. 2021వ సంవత్సరానికి సాయిపల్లవి, ఎస్.సూర్యలను ఎంపికచేయగా, 2023కు సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
అలాగే తమిళనాడు ప్రభుత్వం.. జాతీయ పురస్కారాల విభాగంలో ప్రముఖ నేపథ్య గాయకుడు కె.జె.ఏసుదాస్కు ప్రఖ్యాత గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పురస్కారాన్ని ప్రకటించింది. కళారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవారికి ప్రతి ఏడాదీ ఈ పురస్కారాలను అందించడం తమిళనాడు ప్రభుత్వం ఆనవాయితీ. అక్టోబర్లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.