రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో యూరియా కోసం రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా, రాత్రంతా కేంద్రాల్లోనే ఉన్నా, పొద్దంతా పడిగాపులు కాసినా, వర్షంలో తడిసినా అసలు ఒక బస్తా అయినా దొరుకుతుందా.. లేదా? అనేది తెలియని గందరగోళ పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాత అరిగోస పడుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. అన్నదాత ఆగ్రహానికి కారణమవుతున్నది. రోడ్డెక్కి గొంతెత్తినా ప్రభుత్వం తీరులో మార్పు రాకపోవడంతో యూరియా సంక్షోభంపై దృష్టిపెట్టకపోవడం చూస్తుంటే అన్నదాతలు, వ్యవసాయం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రస్తుత దుస్థితి నిదర్శనంగా నిలుస్తున్నది.
రాయపర్తి, సెప్టెంబర్ 24 : ‘కాంగ్రెస్ ప్రభు త్వం వల్లే నాకీ కష్టం.. నష్టం.. మంచంల పడ్డ నన్ను దవాఖానల సుట్టూ నా తిప్పుతున్నరు. ఈ గోస మరెవరికీ రాకూడ దు’ అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండాకు చెందిన మునావత్ మాం జ్యానాయక్ ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు, తన కుటుంబానికి ఎదురైన ఇబ్బందు లను బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’ తో పంచుకున్నాడు. ఆ వివరాలు ఇలా.. ‘నా కు భార్య శక్రీతోపాటు ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ ఉంది. బిడ్డ, తండాలో నాకున్న రెండు ఎకరాల్లో వరి నాటు వేసుకున్న. మూ డు సోమవారాల కింద (సెప్టెంబర్ 8న) పెర్క వేడులోని రైతువేదిక భవనం కాడ యూరి యా బత్తాలు యిత్తాండ్లు అంటే లేవంగనే పో యి లైన్ కట్టిన.
యూరియా బత్తాల కోసం కూ పన్లు రాసుడు గా సార్లు సురువు చేయంగనే ఒక్కసారే లైన్లల ఉన్నోళ్లంతా ఒగరి మీద ఒగ రు తోసుకునుడు మొదలుపెట్టిండ్లు. నేను గా తోపులాటలో శక్కరచ్చినట్టయి కింద పడిపో యిన. పక్కనున్నోళ్లు మంచినీళ్లు తాపిచ్చి మా వోళ్లకు మతులావు పంపిండ్లు. మావోళ్లంతా మొత్తుకుంటా ఒచ్చి నన్ను ఆటోలో వరంగ ల్లోని రెండు ప్రైవేట్ దవాఖానలకు తిప్పిం డ్రు. డాక్టర్లు నడుముకు బలంగా దెబ్బలు తగిలినయి. కిడ్నీలు కూడా సూయించుకో అంటే అక్కడ కూడా సూయించుకున్నా. ఆరో గ్యశ్రీ పథకం పోను చేతిగుంట రూ.30 వేలు ఖర్చయినయి. అయినా బాగుపడ్డట్టు లేదా యే. నడుముకు పట్టీ పెట్టుకుని పండుకో వాలే అని చెప్పిండ్రు. బరువులు ఎత్తొద్దట. యూరి యా మందు మీద మన్ను బొయ్య. బత్తా దొరుకలేదాయే. బతుకంతా ఆగం అయిపా యే’.. అంటూ కన్నీరుమున్నీరయ్యాడు మాం జ్యానాయక్. ‘కేసీఆర్ సారు ఉన్నన్నీ రోజులు యూరియా, విత్తనాలు, నీళ్లు, కరెంట్, మార్కెట్లకు ఎటువంటి ఢోకా లేకుంటా బ తికినం’.. అంటూ చెప్పుకొచ్చాడు.
యాసంగి కోసం యూరియా దాచుకుంటున్నరు ; ప్రభుత్వ విప్ రామచంద్రూనాయక్
రాష్ట్రంలో యూరియా కొరతతో ఓ వైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రూనాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనులు పక్కనబెట్టి రైతులు యూరియా కోసం అనవసరంగా క్యూలో నిలబడుతున్నారని అవమానకరంగా మాట్లాడారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కంటే ఈసారి రెండు లక్షల బస్తాల యూరియా అదనంగా వచ్చిందని తెలిపారు. రైతులు అదనంగా తీసుకుని యాసంగి కోసం దాచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
యూరియా ఏదయా..?
వరంగల్ జిల్లా సంగెంలోని సొసైటీ వద్దకు యూరియా కోసం రైతులు బుధవారం తెల్లవారుజామున 4గంటలకే తరలివచ్చారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. సుమారు వెయ్యి మంది రాగా 444 బస్తాల యూరియా వచ్చింది. ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇవ్వడంతో మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరిగారు.- సంగెం
ఇటు రెయిన్.. అటు కూపన్
మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని రైతువేదికలో బుధవారం 40 టన్నుల యూరియా రాగా కూపన్ల కోసం పెద్ద సంఖ్యలో రైతులు బారులుతీరారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ తడుస్తూ కూపన్ల కోసం లైన్ కట్టారు. – కోటపల్లి
ఎగబడితేనే ఎరువు దక్కేది..
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. టోకెన్ల కోసం ఎగబడ్డారు. యూరియా తిప్పలపై మండిపడ్డారు. -మూసాపేట
రైతుల ఫోన్.. కల్లెడ సొసైటీకి ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని కల్లెడ సొసైటీ వద్దకు బుధవారం తెల్లవారుజామున సుమారు వెయ్యి మందికిపైగా రైతులు చేరుకున్నారు. క్యూలో నిల్చుకున్నా ఫలితం లేకపోవడంతో పలువురు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఫోన్లో తమ సమస్యను వివరించారు. వెంటనే ఆయన కల్లెడ సొసైటీకి చేరుకుని వారితో మాట్లాడారు. ఆ వెంటనే అధికారులకు ఫోన్ చేసి యూరియాపై ఆరా తీశారు. రెండు నెలలుగా యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ముందు చూపులేకే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తున్నదని విమర్శించారు.
తెల్లవారకముందే లైన్
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకే రైతులు యూరియా కోసం క్యూలో నిల్చున్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. చలికి వణుకుతూ బారులుతీరారు. -హన్వాడ