న్యూఢిల్లీ, నవంబర్ 22: తన 16 నెలల పదవీ కాలంలో పెండింగ్ కేసుల పరిష్కారం, మధ్యవర్తిత్వానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం తన రెండు ప్రధాన ప్రాథమ్యాలని సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సూర్య కాంత్ వెల్లడించారు. ఒక్క సుప్రీం కోర్టులోనే 90 వేలకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని, చీఫ్ జస్టిస్‌గా తాను దీనిని సవాల్‌గా తీసుకుంటానని చెప్పారు.
హైకోర్టులు, దిగువ కోర్టులలో పెండింగ్ కేసులను తగ్గించడానికి కోర్టులు ఒక నిర్ణయానికి రాకుండా నిరోధించిన చట్టపరమైన ప్రశ్నలను నిర్ణయించడానికి రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. కక్షిదారులు దిగువ న్యాయస్థానాలు, హైకోర్టులకు వెళ్లకుండా సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారన్న దానిపై కారణాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు.