న్యూఢిల్లీ, నవంబర్ 22: న్యూయార్క్ మేయర్గా ఇటీవలే ఎన్నికైన జొహ్రాన్ మమ్దానీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో సమావేశం కావడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ శనివారం ప్రశంసించారు. ఎన్నికల ముందు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నప్పటికీ వీరిద్దరూ సమావేశం కావడం ప్రజాస్వామిక స్ఫూర్తి పరిరక్షణగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల తర్వాత పరస్పరం సహకరించుకోవడమే ఈ సమావేశం నేర్పిన పాఠమని ఆయన తన ఎక్స్ పోస్టులో తెలిపారు. సమావేశానికి చెందిన వీడియోను షేర్ చేసిన థరూర్ భారత్లో కూడా ఆ తరహా సహకారాన్ని తాను ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు.
తన వంతుగా తాను అందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలిపారు. కాగా, థరూర్ వ్యాఖ్యలను బీజేపీ ప్రశంసిస్తూ కాంగ్రెస్ నాయకత్వానికి చురకలు అంటించింది. గాంధీ కుటుంబం కన్నా తనకు దేశమే ముఖ్యమని థరూర్ తన పార్టీ నాయకులకు గుర్తు చేశారని బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. అయితే థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించ లేదు. ఇటీవలి కాలంలో థరూర్ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి.