రంగారెడ్డి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. జిల్లాలోని ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ విస్తరించి ఉన్న పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, నార్సింగి, రాజేంద్రనగర్ వంటి మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రెసిడెన్షియల్ భవన నిర్మాణాల పేరుతో జీ ప్లస్-2కు అనుమతులు తీసుకుని.. అదనంగా మూడు నుంచి నాలుగు అంతస్తుల వరకు చేపట్టి కమర్షియల్‌కు వినియోగిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతోనే అక్రమ నిర్మాణాలు ఊపందుకుంటున్నాయని పలువురు మండిపడుతున్నారు.
అనుమతులేమో రెసిడెన్షియల్‌కు..
ఆదిబట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాలిటీల్లో కొందరు రెసిడెన్షియల్ భవన నిర్మాణాల పేరుతో అనుమతులు తీసుకుని.. వాటిపై మూడు నుంచి నాలుగు అంతస్తుల వరకు నిర్మిస్తూ కమర్షియల్‌కు వినియోగిస్తున్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పల్లి గేట్, ఆదిబట్ల గ్రామాల్లో వందల సంఖ్యలో రెసిడెన్షియల్ భవనాలకు అనుమతులు తీసుకుని బహుళ అంతస్తులు నిర్మించి.. వాటిని హాస్టళ్లకు వినియోగిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని.. అధికారుల అండదండలతోనే వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల పరిసర ప్రాంతాల్లో, మంగల్‌పల్లి, ఆదిబట్ల సమీపంలోనూ ఈ దందా యథేచ్ఛగా సాగుతూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది.
టౌన్ ప్లానింగ్ అధికారుల కొరత తీరేదెప్పుడు..?
టౌన్‌ప్లానింగ్ అధికారుల కొరత తీవ్రంగా ఉండటంతో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో 16 మున్సిపాలిటీలుండగా సగం మున్సిపాలిటీలకు టౌన్ ప్లానింగ్ అధికారులే లేరు. ఉన్న వాటికి కూడా డిప్యుటేషన్‌పై వచ్చినవారే అధికంగా ఉన్నారు.