అప్పటి వరకు ఆడిన చేతులు.. పరిగెత్తిన కాళ్లు.. ఒక్కసారిగా కనిపించకుండా పోయాయి. పెను ప్రమాదంలో సర్వం కోల్పోయి.. ప్రాణాలతో బయటపడ్డాడు ఆ బిడ్డడు. పదేండ్ల ప్రాయంలో మృత్యువును జయించిన ఆ పసివాడు.. ఆత్మవిశ్వాసంతో తన వైకల్యాన్నీ అధిగమించాడు. నోటితోనే కుంచె పట్టి బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. ఈ బుడతడి నోర్పరితనానికి మెగాస్టార్ చిరంజీవి సైతం అబ్బురపడ్డాడు. ‘గో ఎహెడ్’ అంటూ ఆశీర్వదించాడు. నోరారా బొమ్మలేస్తూ ఔరా! అనిపించుకున్న మౌత్ ఆర్టిస్ట్ పదిహేనేండ్ల గండిగారి మధుకుమార్ కథ ఇది..
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన ప్రమీల, తుల్జారాం దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అందరిలో మధు చిన్నవాడు. అక్కలు, అన్నయ్య మధును అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఊళ్లోనే పంక్చర్ షాప్ పెట్టుకొని, దాని మీద వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు తుల్జారాం. సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నా.. ఆ కుటుంబంలో సంతోషాలకు కొదువ లేదు. ఇలా రోజులు సాగుతుండగా 2019లో ఓ రోజు ఇంటి మిద్దె మీద ఆడుకుంటున్న మధు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో రెండు చేతులు, కాళ్లు కోల్పోయాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బిడ్డ ప్రాణాలను దాతల సహకారంతో కాపాడుకున్నాడు. కానీ, కాళ్లూ, చేతులు లేని కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు కుంగిపోయారు.
మృత్యువును జయించిన మధు ఇక మీదట తాను అందరిలా ఆటలు ఆడుకోలేనని తల్లడిల్లిపోయేవాడు. తన పనుల కోసం అక్కలు, అన్న మీద ఆధారపడాల్సి వస్తుందని కుమిలిపోయేవాడు. కానీ, కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యంతో మానసికంగా కోలుకున్నాడు. ఇంటి పట్టునే విశ్రాంతి తీసుకుంటున్న మధు జీవితంలోకి బీడీఎల్ రఘు వెలుగులా వచ్చాడు. తన ఇష్టాలను గుర్తించి తనకు తెలిసిన డ్రాయింగ్ మాస్టర్‌కు మధు గురించి చెప్పాడు. ఈ చిన్నారి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. హైదరాబాద్‌కు చెందిన డ్రాయింగ్ ఆర్టిస్ట్ హర్ష వారానికోసారి మధుకుమార్ ఇంటికి వెళ్లి ఉచితంగానే డ్రాయింగ్ నేర్పించడం ప్రారంభించాడు. కాళ్లు, చేతులు లేని మధు.. నోటితో బ్రష్ అందుకొని గీతలు గీయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు బొమ్మలు వేయడం ప్రాక్టీస్ చేశాడు. ‘అమ్మ’ అనే పదంతో మొదలైన మధు ప్రయాణం ఆరు నెలల్లోనే బొమ్మలు వేసేంత వరకు వెళ్లింది.

ఆర్టిస్ట్ హర్ష శిక్షణలో మధు బొమ్మలు గీయడంలో నేర్పరి అనిపించుకున్నాడు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. సినీ నటులు, దేవతా మూర్తులు, స్వాతంత్య్ర సమరయోధులు, తనకు నచ్చిన వ్యక్తుల చిత్రాలను నోటితోనే దిద్దుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి అంటే మధుకు ప్రత్యేక అభిమానం. ఆర్టిస్ట్ హర్ష ప్రోద్బలంతో చిరంజీవి చిత్తరువులను దించాడు. అవి సామాజిక మాధ్యమాల్లో షికార్లు చేసి.. చిరంజీవికీ చేరాయి. ఈ బాల కళాకారుడి ప్రతిభను గుర్తించిన మెగాస్టార్.. మధుకు ఆహ్వానం పంపాడు. అలా 2020లో ఓ షోలో ఉన్న చిరంజీవిని మధు కలిశాడు. ‘షో పూర్తవ్వగానే చిరంజీవి సార్ స్వయంగా నా దగ్గరికి వచ్చి ‘మధు బాగున్నావా’ అని అడిగారు. ఆ క్షణం నాకెంత సంబురమనిపించిందో’ అని ఇప్పటికీ మెరిసే కండ్లతో చెప్తాడు మధు. తనతో కాసేపు మాట్లాడి, బొమ్మ కూడా వేయించుకొని, అభినందించి పంపారట. ఆర్టిస్ట్‌గా ఇప్పుడు మరింత రాటుదేలాడు. నిరంతరం సాధన కొనసాగిస్తూ, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాడు.
ఆర్టిస్ట్‌గా ఒకవైపు రాణిస్తూనే మరోవైపు తన చదువును కూడా కొనసాగిస్తున్నాడు మధు. వీల్ చైర్, స్నేహితుల సహాయంతో బడికి వెళ్తున్నాడు. పదో తరగతిలో 86 శాతం మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. చదువులో మధు పట్టుదల చూసి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి, మధుకు ల్యాప్‌టాప్ బహూకరించారు. ఇంటర్లో సీఈసీ తీసుకున్న మధు.. ఇప్పుడు ఫస్టియర్‌లో చదువుతున్నాడు. ఆత్మ విశ్వాసంతో చిత్రకారుడిగా గుర్తింపు పొందిన మధు.. పెద్ద చదువులు చదివి, కలెక్టర్ కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. కళాకారుడిగానూ గొప్ప పేరు సంపాదిస్తానని నమ్మకంగా చెబుతున్న ఈ అరుదైన చిత్రకారుణ్ని మనమూ అభినందిద్దాం!
– రాజు పిల్లనగోయిన