న్యూఢిల్లీ: జామ్ నగర్‌లోని తమ రిఫైనరీకి రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడం తక్షణమే నిలిపేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ నెల 20న ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి ఇక్కడి నుంచి రష్యా యేతర క్రూడాయిల్‌తో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేయన్నట్లు తెలిపింది. రష్యన్ ముడి పదార్థాల నుంచి తయారు చేసిన రిఫైన్డ్ వస్తువులపై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే, అమెరికా ఒత్తిడికి భారత ప్రభుత్వం తలొగ్గిందని& అందువల్లే రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి మన దేశంలో రష్యన్ క్రూడ్ ఆయిల్‌కు అతి పెద్ద కొనుగోలుదారు రిలయన్స్ కంపెనీనే. ఆంక్షల నేపథ్యంలో నష్టాన్ని తగ్గించుకోవడం కోసం రిలయన్స్ ఈ చర్యలు చేపట్టింది. వాణిజ్యపరమైన క్రమశిక్షణను ఆ కంపెనీ పాటిస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే రిలయన్స్ నిర్ణయంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ నిర్ణయం రిలయన్స్ ఎగుమతుల విభాగానికి మాత్రమే వర్తిస్తుందని..తమకు సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది.