ముంబై, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రైలులో విద్యుత్తు సౌకర్యాన్ని ప్రయాణికులు ఫోన్ చార్జింగ్ కోసం, ఫ్యాన్ల కోసం, వెలుతురు కోసం ఉపయోగించడం సాధారణం. అయితే ఓ మహారాష్ట్ర మహిళ ఏకంగా రైల్లో ఎలక్ట్రిక్ కెటిల్లో టీ తయారు చేసి, మ్యాగీ వండి కేసు కొని తెచ్చుకుంది. చట్ట ప్రకారం దీన్ని నేరంగా భావించిన రైల్వే అధికారులు ఆమెపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.
రైలు బోగీల్లో అధిక ఓల్టేజ్ విద్యుత్తు ఉపకరణాలను ఉపయోగించడం చట్ట విరుద్ధం. వీటిని వాడటం వల్ల విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు భారతీయ రైల్వేల చట్టం, 1989లోని సెక్షన్లు 165, 145, 153 అవకాశం కల్పిస్తున్నాయి. దోషులకు జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. సంఘటన తీవ్రతను బట్టి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.