బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. హుబ్బళిలో విలేకర్లతో మాట్లాడుతూ, బెంగళూరు కేంద్ర కారాగారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినయ్ కులకర్ణి, వీరేంద్ర పప్పిలను డీకే శుక్రవారం కలిశారన్నారు.వారు జైలు నుంచి విడుదలైన తర్వాత వారి మద్దతును పొందడం కోసమే డీకే కలిశారన్నారు.
ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని సిద్ధరామయ్యను కోరినపుడు, ఓటింగ్ కోసం పట్టుబడతారని, అప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లు ఉపయోగపడతాయని అన్నారు. మరోవైపు డీకే మద్దతుదారు హెచ్‌సీ బాలకృష్ణ మాట్లాడుతూ, తమ నేత డీకేకు సొంత బలం, సత్తా ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో కొత్త వివాదం మొదలైంది. క్యాబినెట్లో మంత్రి పదవులపై సిద్దరామయ్య, డీకే వర్గాల మధ్య సయోధ్య కుదరటం లేదు. కీలకమైన బెర్తుల కోసం రెండు వర్గాలు మొండి పట్టుతో ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగాల్సి వచ్చింది. కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలువకుండా మీరు ఆపుతారా? అన్న ప్రశ్నకు డీకే బదులిస్తూ, తాను వారిని ఆపనని స్పష్టం చేశారు. సీఎం సిద్దరామయ్యకు గుడ్‌లక్ చెప్పారు. మరోవైపు మంత్రి పదవులపై ఏర్పడిన గందరగోళాన్ని తొలగించాలంటూ సీఎం సిద్దరామయ్య అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు.