న్యూఢిల్లీ, మార్చి 11: దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీల హవా అంతాఇంతా కాదు. కరోనా వచ్చిన దగ్గర్నుంచైతే ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ జోరు మరీ విపరీతమైందనే చెప్పాలి. ఇక పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా యూపీఐ యూజర్ల భద్రత కోసం అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నదీ చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ సైబర్ కేటుగాళ్ల బారినపడి అమాయకులు మోసపోతున్న ఘటనలూ ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు యూపీఐ వినియోగదారులకు మరో కొత్త ముప్పు వచ్చిపడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
యూపీఐ యాప్స్ సెక్యూరిటీ ఫీచర్లన్నింటినీ నిర్వీర్యం చేసేలా సైబర్ మోసగాళ్లు అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ‘డిజిటల్ లుటేరా’ను వాడుతున్నారని సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ క్లౌడ్‌సెక్ ఓ తాజా నివేదికలో పేర్కొన్నది. మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్‌పై కనీసం 20 క్రియాశీలక బృందాలు ఇప్పుడు డిజిటల్ లుటేరాపైనే దృష్టి పెట్టినట్టు క్లౌడ్‌సెక్ గుర్తించింది. ఒక్కో దాంట్లో 100 మంది సభ్యులుండే బృందాలు దాని పంపిణీ, నిర్వహణ, పనితీరు ఎలా? ఉంటుందన్నదాని గురించే శోధిస్తున్నారని చెప్తున్నది.
ఇక క్లౌడ్‌సెక్ ప్రమాద పరిశోధకుడు శోభిత్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. డిజిటల్ లుటేరా అనేది కేవలం మరో యూపీఐ మాల్వేర్ రకం మాత్రమేగాక, యూపీఐ యూజర్లకు వారు వాడే మొబైల్స్‌పై నమ్మకాన్నే దెబ్బతీసే దాడిగా చెప్తున్నారు. డిజిటల్ లుటేరా ధాటికి మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) దానంతటదే పనిచేయకుండా పోతుంది. ఎంతో విశ్వసనీయమైన సిమ్ బైండింగ్, యాప్ సిగ్నేచర్ చెక్స్ వంటి సంప్రదాయ రక్షణాత్మక వ్యవస్థలు నామమాత్రంగా మారిపోతాయి.
ఎన్పీసీఐ తాజా నివేదికపై స్పందిస్తూ.. ఇలాంటి రిస్క్‌లకు అడ్డుకట్ట వేసేలా అన్ని చర్యల్ని తీసుకున్నామని వినియోగదారులకు భరోసానిస్తున్నది. యూపీఐని అనేక దశల భద్రతా ప్రమాణాలతో, పటిష్టమైన రక్షణ విధానాలతో రూపొందించామని చెప్తున్నది.
ట్రాఫిక్ ఫైన్ నోటీస్, పెండ్లి.. ఇతరత్రా శుభకార్యాలకు ఆహ్వానాల రూపంలో మొబైల్ వినియోగదారులకు సైబర్ మోసగాళ్లు లింక్‌లు పంపిస్తారు. వాటిపై క్లిక్ చేసినప్పుడు కొన్ని ప్రమాదకర ఏపీకేల ద్వారా ఈ డిజిటల్ లుటేరా మొబైల్లో మనకు తెలియకుండానే ఇన్స్టాల్ అవుతుంది.
అప్పట్నుంచి ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ ఫ్రేమ్‌వర్క్‌తో మొబైల్ సిస్టమ్‌ను, ఎస్ఎంఎస్ కార్యకలాపాలనూ తమ ఆధీనంలోని తీసుకుంటారు. సైబర్ నేరగాళ్ల ఆధ్వర్యంలోని టెలిగ్రామ్ చానళ్లకే బ్యాంకుల నుంచి వచ్చే మేసేజ్‌లు, ఓటీపీలు వెళ్లిపోతాయి. వీటి ద్వారా యూపీఐ యాప్‌లపై లావాదేవీలు జరిపి సొమ్మును కాజేస్తారు. దాంతో మన ఖాతాలు ఖాళీ అవుతాయని ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. అందుకే ఈ డిజిటల్ లుటేరా సంగతి తేల్చకపోతే యావత్తు డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థే నాశనం కాగలదని కూడా వారు హెచ్చరిస్తుండటం గమనార్హం.