తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో పుట్టింది. ఆనాటి మూడున్నర కోట్ల మంది గొంతుకైంది. సమైక్య పాలకుల మోసాలకు వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించింది. స్వరాష్ట్ర సాధన పోరాటంలో సబ్బండ వర్గాలను ఏకతాటిమీదకు తేవడంలో తనవంతు పాత్ర పోషించింది. ఆంధ్రా ఆధిపత్యపు మీడియా సంస్థల ద్వంద్వ నీతిని ఉతికి ఆరేస్తూ తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపేందుకు అలుపెరగని అక్షర పోరాటం చేసింది. దశాబ్దాల కల నెరవేరేంత వరకు ప్రజల పక్షమై కొట్లాడింది. అదేంటని ఆలోచిస్తున్నారా? అదే.. ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక. తెలంగాణ ప్రజల గొంతుకైన ఈ పత్రికే.. తాజాగా ఖమ్మంలోని భూదాన్ భూముల బాధితులకూ వెన్నుదన్నుగా నిలిచింది. పేదల గుడిసెలు కూల్చిన నాటి నుంచి వారి సమస్యను సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు తన ఉద్యమకాలం నాటి ప్రస్థానాన్ని కొనసాగించింది. కాంగ్రెస్ సర్కారు దాష్టీకం పుణ్యమా అని ఇక్కడి ప్రజలు అనుభవిస్తున్న వెతలను, ఆర్తనాదాలను ప్రధాన, జిల్లా సంచికల్లో పతాక శీర్షికలుగా ముద్రించి బాధిత పేదలకు కొండంత అండగా నిలిచింది. ఆ అభాగ్యులకు యావత్ తెలంగాణ ప్రజల మద్దతును కూడగట్టింది.
-ఖమ్మం సిటీ, మార్చి 11
వెలుగుమట్ల వ్యవహారం రెండు మూడు రోజుల్లో సర్దుకుంటుందిలే అనుకున్న కాంగ్రెస్ పాలకులకు బీఆర్ఎస్ కూడా కంటిమీద కునుకులేకుండా చేసింది. భూదాన్ బాధితుల పరామర్శకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంతో నిరాశ్రయుల అరిగోస జాతీయస్థాయిలో చర్చకు దారితీసిన విషయం విదితమే. అదే సమయంలో, అదే స్ఫూర్తితో నమస్తే తెలంగాణ పత్రిక కూడా ప్రతిరోజూ బాధితుల కష్టాలకు అక్షరరూపమిచ్చింది. కడగండ్లను చిత్రమాలికలుగా ముద్రించింది.
భూదాన్ భూముల్లో జరుగుతున్న హస్తం నేతల గారడీలను, అధికారుల ఆకృత్యాలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ సబ్బండ వర్గాల మనసును గెలుచుకుంది. అధికార పార్టీ కనుసన్నల్లోని కొన్ని మీడియా ఛానెళ్ల బాధ్యులు, పలు రాజకీయ పార్టీల నేతలు.. రోడ్డున పడిన పేదలను గాలికొదిలేశారు. కొందరి మోసపూరిత విధానాల కారణంగానే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయంటూ ప్రచారం చేశారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ, తెలంగాణ ప్రజల మానస పు(ప)త్రిక అయిన నమస్తే తెలంగాణ.. తనదైన శైలిలో నిజానిజాలను బయటికి తీసింది. ప్రభుత్వ పెద్దలు తనపై అక్కసు వెళ్లగక్కినా, హెచ్చరికలు జారీచేసినా ఏమాత్రమూ వెనకడుగు వేయలేదు.
ఉద్యమకాలం నాటి రోజులను గుర్తుకుతెస్తూ ముందుకుసాగింది. దినదినగండంగా బతుకుతున్న బీదలకు వెన్నుదన్నుగా నిలిచింది. అక్కడ నివసిస్తున్న వారంతా తెలంగాణ బిడ్డలేనని, వారందరికీ న్యాయం జరగాల్సిందేనని గులాబీ దళపతి కేసీఆర్ చేసిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వమే దిగి వచ్చి పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చేంత వరకు అలుపెరగని అక్షర పోరాటం చేసింది. గత్యంతరంలేని పరిస్థితుల్లో బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో దాదాపు 400 పైచిలుకు నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారంటే అందులో ‘నమస్తే తెలంగాణ’ పాత్ర క్రియాశీలకమని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
కాగా, భూదాన్ బాధితుల్లో ఎవరిని పలుకరించినా.. నమస్తే తెలంగాణ అక్షరపోరాటం గురించి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషి గురించే చెబుతున్నారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఖమ్మానికి రాకపోయి ఉంటే తమ బతుకులు కుక్కలు చింపిన విస్తరిలా అయ్యేవని అంటున్నారు. ‘పువ్వాడ ఫౌండేషన్’ బాధ్యులతోపాటు మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు లేకపోతే తాము పస్తులతోనే కన్నుమూసే వారమని అంటున్నారు. వారికి జన్మజన్మలా రుణపడి ఉంటామని చేతులెత్తి నమస్కరిస్తున్నారు. అదేవిధంగా తమపక్షాన నిలబడిపోరాడిన ‘నమస్తే తెలంగాణ’, ‘టీ న్యూస్’ సంస్థలకు రుణపడి ఉంటామంటూ ఆనంద భాష్పాలు రాలుస్తున్నారు. తమ వేదన, రోదన, కన్నీటి గోసను బయటి ప్రపంచానికి తెలియజేయడంలో ఆ రెండు సంస్థలు చాలా గొప్పగా వ్యవహరించాయని కితాబిస్తుండడం విశేషం.