హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం.. వయసులో చాలా చిన్నదే అయినా అభివృద్ధిలో ఘనం. భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఏడేండ్ల ప్రయాణంలోనే అన్ని రంగాల్లో గణనీయ వృద్ధిని నమోదు చేస్తున్నది. ఆర్థిక వృద్ధిలో రికార్డులు సృష్టిస్తున్నది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, నివేదికలు, విశ్లేషణలే స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ పత్రిక విశ్లేషణలో తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం మరోసారి దేశం ముందు సాక్షాత్కారమైంది. ‘ఆదాయం పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అన్న సూత్రంతో ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఓవైపు రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నది. మరోవైపు వచ్చిన ప్రతి పైసాను సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల రూపంలో ప్రజలకు పంచుతున్నది. చిన్న రాష్ట్రమైనా దేశాభివృద్ధికి పాటుపడుతున్నది. దేశాన్ని సాకుతున్న మూడు, నాలుగు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచి సత్తా చాటుతున్నది.
దేశంలో ప్రధాన ఆర్థిక శక్తులుగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఓ జాతీయ పత్రిక విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. దేశాన్ని తూర్పు, పశ్చిమ, మధ్య (సెంట్రల్), దక్షిణ, ఉత్తర రీజియన్ల పేర్లతో 5 భాగాలుగా విభజించిన ఈ నివేదిక.. ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చితే దక్షిణాది రాష్ర్టాలు ఎంతో బలంగా ఉన్నట్టు తేల్చింది. తూర్పు రీజియన్‌లోని 13 రాష్ర్టాల జీఎస్డీపీ కంటే మధ్య రీజియన్‌లోని తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ర్టాల జీఎస్డీపీ దాదాపు రూ.1.5 లక్షల కోట్లు ఎక్కువ ఉన్నట్టు లెక్కగట్టింది. తలసరి ఆదాయం సైతం రెట్టింపు ఉన్నట్టు స్పష్టం చేసింది. దక్షిణాదిలో ఏపీని మినహాయిస్తే మిగతా 4 రాష్ర్టాలు బలమైన ఆర్థిక రీజియన్లలో ఉన్నాయి. దక్షిణాది రాష్ర్టాల సగటు తలసరి ఆదాయం రూ.1.7 లక్షలుగా, ఉత్తరాది రాష్ర్టాల సగటు తలసరి ఆదాయం రూ.లక్షగా తేలింది. మధ్య, దక్షిణ భారత రీజియన్లలో అత్యధికంగా రూ.1.70 లక్షల తలసరి ఆదాయం నమోదైంది. ఇందులో తెలంగాణ సహా 4 రాష్ర్టాలు ఉన్నాయి.
సొంత రాబడుల్లో తెలంగాణ.. దేశంలోనే మొదటి స్థానంలో ఉండటమే కాకుండా.. ఇతర రాష్ర్టాలకు అందనంత ఎత్తులో నిలిచింది. వ్యవసాయం, విద్యుత్తు, పరిశ్రమలు, ఐటీ సహా అన్ని రంగాల్లోనూ తెలంగాణ రెట్టింపు వృద్ధి సాధించడమే ఇందుకు కారణమని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (ఎంవోపీఐఎస్) ఇటీవలి నివేదికలో పేర్కొన్నది. వివిధ రంగాల్లో 18 రాష్ర్టాలు సాధించిన ప్రగతిని వివరిస్తూ విడుదలైన ఈ నివేదిక.. 2014-15తో పోల్చితే 2020-21 నాటికి తెలంగాణ జీఎస్డీపీ దాదాపు రెట్టింపయినట్టు వెల్లడించింది. రాష్ట్రంగా ఏర్పడే నాటికి రూ.5,05,849 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ 2020-21 నాటికి రూ.9,80,407 కోట్లకు పెరిగినట్టు తెలిపింది. 2014-21 మధ్యకాలంలో తెలంగాణ జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధిరేటు 11.7 శాతంగా ఉన్నది. ఇదే సమయంలో దేశ జీడీపీ వార్షిక వృద్ధిరేటు 8.1 శాతానికే పరిమితమైంది. అత్యధిక సగటు వృద్ధిరేటు సాధించిన రాష్ర్టాల్లో మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ.. దక్షిణ భారత దేశంలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఎంత అభివృద్ధి చెందుతున్నదో చెప్పేందుకు ప్రజల తలసరి ఆదాయమే గీటురాయి. ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632. ఇది జాతీయ తలసరి ఆదాయం (రూ.1,28,829) కంటే 1.84 రెట్లు అధికం. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తెలంగాణ 2015-16లో గుజరాత్‌ను, 2016-17లో తమిళనాడును, 2017-18లో మహారాష్ట్రను 2018-19లో కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్‌ను, 2020-21లో హిమాచల్‌ప్రదేశ్‌ను దాటేసింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రూ.1,24,104గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం 2020-21 నాటికి రూ.2,37,632కు పెరిగింది. ఈ ఏడేండ్లలో 91.5% వృద్ధి నమోదైంది. దీంతో అత్యధిక వృద్ధిని సాధించిన రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.86,647 నుంచి రూ.1,28,829కి పెరిగింది. వృద్ధిరేటు 48.7 శాతమే.
తెలంగాణలో ప్రగతి అత్యద్భుతం. వృద్ధిలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన రెండేండ్లలోనే తెలంగాణలో గుణాత్మక మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది.
దేశంలోనే అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్నది. ఇకపై కూడా ఇలాగే కొనసాగాలి. ప్రజల కనీస అవసరాలు తీర్చే పనులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యమిస్తున్నది.
వయసులో తెలంగాణ చిన్నదే అయినా అభివృద్ధిలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటినుంచి ఏటా 9 శాతానికిపైగా వృద్ధి సాధిస్తున్నది. నూతన పాలసీలు, పరిశ్రమలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణ దేశాన్ని సాదుతున్న కొద్ది రాష్ర్టాల్లో ఒకటిగా ఉన్నది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న 4 రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.
ఆదర్శవంతమైన కార్యక్రమాలతో తెలంగాణ వృద్ధిలో పరుగులు తీస్తున్నది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు, పథకాలు రూపొందించి విజయవంతంగా అమలుచేస్తున్నది.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఏడేండ్లలోనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ దేశానికే మార్గదర్శిగా ఎదిగింది. టీఎస్ ఐపాస్, టీ-హబ్ లాంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నది. వివిధ రంగాల్లో వినూత్న విధానాలను అవలంబిస్తూ దేశంలోనే ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.
ఆర్థిక సంసరణల అమలులో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలను సాధించింది. మున్సిపల్ సంసరణలను సమర్థంగా అమలు చేసి బహిరంగ మారెట్ నుంచి మరో రూ.2,508 కోట్ల రుణం పొందడానికి అర్హత సాధించింది.
-కేంద్ర ఆర్థికశాఖ (జనవరి 7, 2021)
అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా ముందుకెళ్తున్నది. వ్యాపార సంసరణల్లో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో నిలిచింది.
తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా 20% వార్షిక వృద్ధి లక్ష్యంతో ప్రణాళికలు అమలు చేయడం, సగటున 14-15% వృద్ధి సాధించడం చాలా గొప్ప విషయం.