TVK chief Vijay : ఎన్నికల షెడ్యూల్ (Elections Schedule) రాకముందే తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీవీకే పార్టీ (TVK Party) కి రాజకీయాల్లో అనుభవం లేదంటూ ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలపై నటుడు, ఆ పార్టీ అధినేత విజయ్ (Actor Vijay) గట్టి కౌంటర్ ఇచ్చారు. తమకు దోపిడీల్లోనూ అనుభవం లేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అధికార డీఎంకేపై విజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సేలంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో విజయ్ మాట్లాడారు. ‘నా ఓటు.. నా హక్కు. ఎవరూ దాన్ని కొనలేరు’ అంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఎన్నికల సమయంలో అనేక మంది వచ్చి మీకు వేల రూపాయలు ఇస్తారు. అది మీ డబ్బే.. దాన్ని తీసుకోండి. సొమ్ము తీసుకున్న తర్వాత.. గట్టిగా విజిల్ వేయండి’ అని విజయ్ తన పార్టీ గుర్తును ప్రస్తావించారు. ఈ పోరాటం డీఎంకే, టీవీకే మధ్యనే ఉందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విజయ్ ఆరోపించారు. హామీలపై ప్రభుత్వం ప్రజలకు అసత్యాలు చెబుతూనే ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని మహిళలకు భద్రత ఉందంటూ సీఎం గొప్పలు చెబుతున్నారని, అయితే వారిపై నేరాలు ఎందుకు పెరుగుతున్నాయని టీవీకే చీఫ్ ప్రశ్నించారు. తాను ఏ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదని, రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే వచ్చానని స్పష్టంచేశారు.
రాజకీయాల్లో అనుభవం గురించి వచ్చిన విమర్శలపై మాట్లాడుతూ.. ‘నా రాజకీయ అనుభవంపై అనేక మంది ప్రశ్నిస్తున్నారు. నన్ను ప్రశ్నించేవారికి దోపిడీల్లో కూడా అనుభవం ఉంది. కానీ మాకు అందులో కూడా అనుభవం లేదు’ అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్తో పొత్తుకు రెడీ అంటున్న స్టాలిన్.. కాంగ్రెస్తో పొత్తు పనిచేయదంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను విజయ్ గుర్తుచేశారు.