Diabetes Symptoms On Skin | డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మన దేశంలో దాదాపు 90 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారని 2025 -26 లో నిర్వహించిన ఓ ఆర్థిక సర్వే చెబుతోంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. అధిక దాహం, తరచూ మూత్రవిసర్జన, విపరీతమైన అలసట, దృష్టి లోపాలు వంటి సంకేతాలు డయాబెటిస్ ను తెలియజేస్తాయి. ఇవే కాకుండా మన చర్మం కూడా డయాబెటిస్ సంకేతాలను తెలియజేస్తుంది. కానీ చర్మంపై వచ్చే ఈ మార్పులను చాలా మంది తోసిపుచ్చుతారు. కానీ ఈ లక్షణాలను గమనించి తక్షణ వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉందని చర్మం తెలియజేసే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరం లోపల జీవక్రియ మార్పులు జరిగినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు చర్మంపై చిన్న, గుండ్రని, గోధుమ రంగు లేదా ఎరుపు రంగు మచ్చలు అభివృద్ది చెందుతాయి. ఇవి ఎక్కువగా కాళ్లపై కనిపిస్తాయి. ఈ మచ్చల వల్ల ఎటువంటి నొప్పి, దురద ఉండదు. రక్తనాళాల్లో డయాబెటిస్ కారణంగా జరిగే మార్పులను ఈ మచ్చలు సూచిస్తాయి.
డయాబెటిస్ కారణంగా మెడ, చంకలపై చర్మం నల్లగా మారుతుంది. అలాగే చర్మం మందంగా తయారవుతుంది. శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడానికి ఇబ్బంది పడుతుందని ఈ సంకేతాలు తెలియజేస్తాయి. ఊబకాయం, డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ లక్షణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. చర్మం ఇలా రంగు మారడాన్ని గమనించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
గాయాలు తగిలినప్పుడు చర్మం సకాలంలో నయం అవ్వదు. చర్మం నయం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. డయాబెటిస్ కారణంగా శరీర జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. దీంతో చర్మానికి రక్తప్రవాహం, ఆక్సిజన్, పోషకాలు నెమ్మదిగా అందడం వల్ల గాయాలు నెమ్మదిగా నయం అవుతాయి. అంతేకాకుండా డయాబెటిస్ కారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. బలహీనమైన రోగనిరోధక కణాలు చర్మ కణజాలాన్ని మరమ్మత్తు చేయడంలో అవరోధాలు కలగడం వల్ల కూడా చర్మ గాయాలు మానడానికి సమయం ఎక్కువగా పడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల సూక్ష్మ క్రిములు సులభంగా శరీరంపై దాడి చేస్తాయి. తద్వారా పదేపదే తామర, కాండిడియాసిస్, మూత్రనాళాల ఇన్పెక్షన్లు, చర్మపు గడ్డలు వంటి సమస్యలు వస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల శరీరం నుండి నీరు ఎక్కువగా బయటకు వస్తుంది. ఇది డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. దీంతో చర్మం పొడిగా మారుతుంది. దురద కూడా ఎక్కువగా వస్తుంది. దీనితో పాటు రక్తంలో ఎక్కువగా ఉండే చక్కెర స్థాయిలు రక్తనాళాలను, నరాలను దెబ్బతీస్తాయి. దీంతో చర్మాన్ని తేమగా ఉంచే చెమట, నూనె ఉత్పత్తి తగ్గుతుంది. చర్మానికి రక్తప్రసరణ, పోషకాలు సరిగ్గా అందకపోవడం వల్ల చర్మం పొడిగా మారడంతో పాటుగా దురద కూడా ఎక్కువగా వస్తుంది.
ఈ సమస్య చాలా అరుదైనప్పటికీ పాదం అడుగు భాగంగా స్పష్టమైన అంచులతో మెరిసే, గోధుమ లేదా పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అలాగే ఈ మచ్చలు పడిన చోట చర్మం పలుచగా తయారవుతుంది. చర్మం లోపల నుండి సిరలు కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు పుండ్లు పడే అవకాశం కూడా ఉంది. ఈ సమస్య మహిళలు, దీర్ఘకాలంగా చక్కెర వ్యాధితో బాధపడే వారిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చర్మం దాని సహజ రంగును కోల్పోయి పాలలా తెల్లగా మారుతుంది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో బొల్లి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్ ఒక ఆటో ఇమ్యూన్ ఆరోగ్య పరిస్థితి. కనుక బొల్లి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే ఆరోగ్యకరమైన చర్మ కణాలను తప్పుగా భావించి వాటిపై దాడి చేస్తుంది. దీంతో చర్మం తెల్లగా మారిపోతుంది. ఇక టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారిలో దీర్ఘకాలిక జీవక్రియ ఒత్తిడి, రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల బొల్లి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చర్మం తెలియజేసే ఇటువంటి లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. డయాబెటిస్ ను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడానికి వీలు ఉంటుంది. డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల శరీర మొత్తం ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.