Hrithik Roshan | బాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘డాన్ 3’ చుట్టూ గత కొద్దిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎట్టకేలకూ తెరదించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ సింగ్ తప్పుకున్న అనంతరం ఆయన స్థానంలో హృతిక్ నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని హృతిక్ స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం తనను ఎప్పుడూ సంప్రదించలేదని, కేవలం పుకార్ల ఆధారంగానే ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇటువంటి నిర్ధారణ లేని వార్తలను ప్రసారం చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేస్తూ, అనవసరపు చర్చలకు ముగింపు పలికారు.
అసలు ఈ వివాదం రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారనే వార్తలతో మొదలైంది. రణ్వీర్ తప్పుకోవడం వల్ల తమకు సుమారు రూ. 40 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే, సరైన స్క్రిప్ట్ సిద్ధంగా లేకపోవడం వల్లే రణ్వీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.