ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. ఇటీవలే పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం యూరప్ పయనమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రీస్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్‌పై తెరకెక్కిస్తున్న సోలో గీతమిది.
ఇది పూర్తయిన తర్వాత ప్రభాస్-నిధిఅగర్వాల్పై ఓ రొమాంటిక్ పాటను తీయబోతున్నారు. ఈ రెండు పాటలతో షూటింగ్ మొత్తం పూర్తయినట్లేనని చెబుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో హరర్ అంశాలతో పాటు ప్రభాస్ పండించిన కామెడీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్‌దత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: తమన్, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: మారుతి.