సంగారెడ్డి, అక్టోబరు 9: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన పోటీకి బీఆర్ఎస్ సిద్ధ్దంగా ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి చికిత్స ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారెంటీలు, హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఒక పదవికి నలుగురు పోటీలో ఉంటే, పార్టీ నాయకులు సమన్వయం చేసుకుని ఒకరిని ఎంపిక చేసి ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. అత్యధిక జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలన్నారు. సమావేశంలో కంది మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.