Actress Ramya | కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్యకు సోషల్ మీడియాలో అసభ్యంగా మెసేజ్‌లు పంపిన కేసులో కర్నాటక పోలీసులు కీలక ముందడుగు వేశారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అధికారులు ఈ కేసులో 12 మంది దర్శన్ అభిమానులపై గురువారం 380 పేజీలతో భారీ ఛార్జ్‌షీట్‌ను 45వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. దర్శన్ అభిమాని హత్య కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతూ రమ్య ఒక సోషల్ మీడియా పోస్ట్ చేశారు. అయితే, కొందరు దర్శన్ అభిమానులు ఆమెపై సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా కామెంట్స్ చేశారు. మరికొందరు ఆమెను రేప్ చేస్తామంటూ హెచ్చరించారు.
ఈ వ్యవహారంపై నటి రమ్య జులై 28న బెంగళూరు సీపీ సీమంత్ కుమార్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురి చేస్తున్న వారి అకౌంట్స్ వివరాలను సైతం పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా.. వీరంతా దర్శన్ అభిమానులేనని తేలింది. ఛార్జ్‌షీట్‌లో రమ్య ఇచ్చిన వాంగ్మూలం, నిందితులు ఒప్పుకోవడం, సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను చేర్చారు. అరెస్ట్ అయిన 12 మందిలో నలుగురు జైలులో ఉన్నారు. మిగతావారు బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ వ్యవహారంపై నటి రమ్య మాట్లాడుతూ తాను.. సామాన్య ప్రజలకూ న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో దర్శన్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును గురించి పోస్ట్ చేశానని తెలిపారు. మహిళల గొంతుగా ఈ ఫిర్యాదు చేశానని.. నాకే ఇలాంటి వేధింపులు ఎదురైతే.. సాధారణ మహిళలు ఎంత బాధపడతారో ఊహించగలనన్నారు. నటులుగా, ప్రజలకూ ఆదర్శంగా ఉండాల్సిన వారు చట్టాన్ని గౌరవించాలని.. తన అభిమానులను కూడా అలాంటి పనులు చేయవద్దని దర్శన్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే అరెస్టయిన 12 మందితో పాటు, పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని అరెస్టు తర్వాత అదనపు ఛార్జ్‌షీట్ సమర్పిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణ కూడా త్వరలోనే కోర్టులో ప్రారంభం కానుంది. అభిమాని రేణుక స్వామి హత్య కేసులో దర్శన్ ఏ2గా.. నటి పవిత్ర గౌడ ఏ1గా బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.