జైనూర్, సెప్టెంబర్ 9 : ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్త ఆదేశించారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, వారికి ఐరన్-సీ విటమిన్ ట్యాబ్లెట్లు అందించాలన్నారు.
సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతిరోజూ వంటశాల స్టోర్ రూమ్, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు బోధించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.మందుల నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ప్రిన్సిపాల్ పార్వతి, వైద్యులు డా.నాగర్గోజే అశోక్, డా.ఉదయ్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులున్నారు.