భూదాన్‌పోచంపల్లి, అక్టోబర్ 9: ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. భూదాన్‌పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలో వారు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిన హామీలను కాంగ్రెస్ బాకీ కార్డుల రూపం లో ప్రజలకు వివరించాలన్నారు. తాము అధికారంలోకి వస్తే అన్ని హామీలను వందరోజు ల్లో అమలు చేస్తామని చెప్పి, 22 నెలలు గడుస్తున్నా అమలు చేయలేదన్నారు.
ప్రతి మహిళకు నెలకు 2,500లు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఆ బాకీ కింద ప్రభుత్వం ఒకో మహిళకు రూ. 55 వేలు బాకీ పడిందని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, పింఛన్‌దారులకు ఇస్తామన్న రూ.4 వేలు అమలు చేయకపోవడంతో ఆ బాకీ రూ. 44,000లకు పెరిగిందన్నారు.
ప్రతి ఎకరాకు ఇస్తామన్న రూ.12,500లు ఇవ్వకపోవడంతో రైతు భరోసా కింద నాలుగెకరాల రైతుకు రూ.76 వేలు బాకీ పడిందన్నారు. రూ.రెండు లక్షల రుణమాఫీ, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కింద 22 నెలకు రూ.88000, విద్యా భరోసా కింద ఐదు లక్షలు, ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 12,000 చొప్పున రెండేళ్లకు రూ.24000 బాకీ, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ.12000 చొప్పున 24000 బాకీ, విద్యార్థులకు సూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంటు కింద రూ.8 వేల కోట్లు ప్రభుత్వం బాకీ పడిందనన్నారు.
కార్యక్రమం లో మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాళ భూపాల్‌రెడ్డి, జిల్లా నాయకుడు కోట మల్లారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ప్యాట చంద్రశేఖర్, బందారపు లక్ష్మణ్‌గౌడ్, అందేలా హరీశ్, బత్తుల శ్రీశైలం గౌడ్, కొంతం ఈశ్వరయ్య, ముద్దగొని సతీష్‌గౌడ్, గూడూరు భవాని చంద్రశేఖర్, మల్లేశ్, నూనెముంతల భాసర్, కంచర్ల గణేశ్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.