‘పేదల కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు కట్టివ్వాలని నిర్ణయించింది. వాసాలమర్రిలో ఒక్క ఇల్లు కూడా కట్టకుండా మోసం చేశారు. గ్రామానికి 227 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం’ ఇవీ ఈ నెల 19న వాసాలమర్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది.
యాదాద్రి భువనగిరి, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూ రు ప్రకటనలకే పరిమితమైంది. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఎంతో చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా క్షేత్రస్థాయిలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరిగ్గా పట్టుమని పదిహేను మందికి కూడా ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వకుండా అంతా అయిపోయిందన్నట్లు కాంగ్రెస్ సర్కారు కలరింగ్ ఇవ్వడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో వాసాలమర్రిని కేసీఆర్ దత్తత తీసుకున్నారు. గ్రామంలో కొత్తగా 481 ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. అందులో భాగంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పెండింగ్‌లో పడింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరుతో పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించింది. వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 560 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల పేరుతో అర్హుల జాబితాను 180 మందికి తగ్గించినట్లు తెలిసింది. తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు తమ వారి కోసం మరికొన్ని పేర్లను ప్రతిపాదించడంతో ఆ సంఖ్య 227కి పెరిగినట్లు సమాచారం.
ఇటీవల ఇదే మండలంలోని తిమ్మాపూర్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో వాసాలమర్రి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హడావుడిగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీకి ప్లాన్ చేశారు. అనేక చోట్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నా.. వాసాలమర్రి గ్రామాన్నే ఎంచుకున్నారు.
ఈ నెల 19న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రప్పించి ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కోసం సభ ఏర్పాటు చేశారు. కేవలం 15 మందికే పంపిణీ చేశారు. మిగతావారికి మొండిచెయ్యి చూపించారు. తమకెప్పుడు ఇస్తారని అక్కడున్న వాళ్లు ప్రశ్నించగా.. మంత్రి వెళ్లగానే అందరికీ ప్రొసీడింగ్ కాపీలు అందజేస్తామని సమాధానమిచ్చారు. కొందరికేమో ఇంటికే తెచ్చిస్తామని, వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పటికి నాలుగు రోజులు గడుస్తున్నా పట్టాలు మాత్రం రాలేదు.
ప్రభుత్వానికి, అధికారులకు ఓ ఇబ్బంది అడ్డం వచ్చినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం 560 మంది దరఖాస్తు చేసుకుంటే 227 మందికి మాత్రమే ఇవ్వడంతో అంతా సస్పెన్స్‌గా మారింది. అధికారులు ఇప్పటి వరకు జాబితాను విడుదల చేయలేదు. తమకు రాకపోతే లొల్లి చేస్తారనే ఉద్దేశంతో మంత్రి కార్యక్రమంలో పరిమిత సంఖ్యలో ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.
ఇప్పుడు జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో అర్థంకాని పరిస్థితి. పేర్లు బయటకు వస్తే మిగతా వారు రచ్చ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మాత్రం తమ పేర్లు ఉండొచ్చని ఆశాభావంతో అంతా సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది. ‘కొన్నిచోట్ల ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలకు కూడా ఇచ్చారట. కాంగ్రెసోళ్లు అనర్హులను కూడా జాబితాలో పెట్టారట. మాకెందుకు ఇవ్వరు?’ అంటూ గ్రామంలో ఇప్పుడు దీనిపైనే విస్తృత ప్రచారం జరుగుతోంది. మరోవైపు అధికారులు మాత్రం సోమవారం నుంచి కొంత మందికి పట్టాలు ఇస్తామని చెబుతుండటం కొసమెరుపు.