Utkur | ఊట్కూర్, జూలై 29: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా బుధవారం ఉదయం పెద్దసంఖ్యలో పోలీసులు మండల కేంద్రంలోని వివిధ కాలనీలు, ప్రధాన వీధులు, కూడళ్లలో మోహరించి ఇంటింటినీ తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను నమోదు చేయడంతో పాటు వాహనాల పత్రాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.