Minister Seethakka | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వరిధాన్యం కొనుగోళ్లు చేయండి.. బోనస్ ఇవ్వండి అని అడిగిన పాపానికి రైతులకు పార్టీలు అంటగట్టి మంత్రి సీతక్క అక్రమ కేసులు పెట్టించారు. పడిగల శ్రీనివాస్(రామారెడ్డి), నారెడ్డి దశరథ్ రెడ్డి(మాజీ ఎంపీపీ, పోసానిపేట్ గ్రామం), కొత్తొల్ల గంగారం(ఉప్పలవాయి), బాలదేవ్ అంజయ్య(రామారెడ్డి), ద్యాగల మహిపాల్(రామారెడ్డి), హన్మయల్లా రాజయ్య(రామారెడ్డి)పై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.
నిన్న గురువారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి సీతక్కను అడ్డుకుని, బోనస్ ఇవ్వాలని, సకాలంలో పంట కొనుగోళ్లు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. దీంతో అన్నదాతలు తాగుబోతులు అని మంత్రి సీతక్క నోరు పారేసుకున్నారు. తాగొచ్చి.. నా కాన్వాయ్కి అడ్డు పడతారా ? అంటూ రైతులపై రెచ్చిపోయారు ఆమె. సమస్యలు వివరిస్తున్న రైతులపై ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశారు. అసలు మీరంతా రైతులేనా? తాగి వచ్చారా? అంటూ సీతక్క దురుసుగా ప్రవర్తించారు. ఇక మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతులు నిరసన చేపట్టారు.