Crime news : అటవీ శాఖ అధికారి (Forest officer) తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి తన సహోద్యోగినితో వివాహేతర బంధం ఉన్నట్లు గుర్తించారు. గత నాలుగేళ్లుగా వారి బంధం కొనసాగుతున్నట్లు తేలిందని చెప్పారు. అయితే ఈ హత్యల్లో ఆమె పాత్ర ఉందా.. లేదా..? అనే విషయం స్పష్టం కావాల్సి ఉందన్నారు.
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో అటవీ అధికారి శైలేష్ ఖాంబ్లా (40) తన భార్య నయన (40), కుమార్తె ప్రీత (13), కుమారుడు భవ్య (9) ని దారుణంగా హత్యచేశాడు. అనంతరం తన ఇంటివెనుకాల గోతిలో మృతదేహాలను వేసి పూడ్చాడు. ఈ నెల 16న వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో పలు వివరాలు రాబట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖాంబ్లా ఈ నెల 2న తన దగ్గర పనిచేసే జూనియర్ అధికారి గిరీశ్ వానియాకి ఫోన్ చేసి.. చెత్తను పూడ్చేందుకు తన ఇంటి వెనుకాల రెండు గోతులు తీయించమని చెప్పాడు. దాంతో గిరీశ్ ఈ నెల 2న అతను చెప్పినట్టే చేశాడు.
ఆ తర్వాత ఈ నెల 5న అధికారి ఖాంబ్లా.. రెండు రోజులుగా తన భార్యాబిడ్డలు కనిపించడంలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఓ ఆటోలు వెళ్లడం తన ఇంటిదగ్గరి సెక్యూరిటీ గార్డు చూశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే పోలీసులు సెక్యూరిటీ గార్డును విచారించగా తాను అలాంటిదేమీ చూడలేదని చెప్పాడు.
దాంతో ఖాంబ్లా తీరును అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో ఇంటారేగేట్ చేయగా నిజం ఒప్పుకున్నాడు. ముగ్గురిని దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు తెలిపాడు. అనంతరం అతడి ఫోన్ కాల్ రికార్డ్స్‌ను పరిశీలించగా అతడికి తన సహోద్యోగినితో వివాహేతర బంధం ఉన్నట్లు బయటపడింది.
ఆమె గురించి ఖాంబ్లాను ఆరా తీయగా తమ మధ్య నాలుగేళ్లుగా వివాహేతర బంధం కొనసాగుతున్న విషయాన్ని అంగీకరించాడు. తన భార్యాబిడ్డలు సూరత్‌లో ఉండేవారని, తాను ఉద్యోగరీత్యా భావ్‌నగర్‌లో ఉంటున్నానని తెలిపాడు. అయితే తన భార్య భావ్‌నగర్‌కు వస్తామని తరచూ ఒత్తిడి చేస్తుండటంతో చంపేశానని చెప్పాడు.