నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచున కొట్టుమిట్టాడుతోంది. వరద ఉధృతి భారీగా పెరగడంతో అలుగు పది అడుగుల తీవ్రతతో కిందికి దుంకుతున్నది. అయినప్పటికీ వరద నియంత్రణ కాకపోగా ప్రవాహం మట్టి కట్టను ఢీకొని పొంగిపొర్లుతోంది. తద్వారా భారీ బుంగ ఏర్పడే ప్రమాదం నెలకొంది. అదే జరిగితే పోచారం ప్రాజెక్టు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి.
కాగా, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నిజామా బాద్- హైదరాబాద్ మార్గంలో కామరెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న కారణంతో పలు రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ను రద్దు చేయగా, నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను కాచిగూడ, కాజీపేట, పెద్దపల్లి, నిజామాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నారు.