కామారెడ్డి : అతి భారీ వర్షాలతో(Heavy rains) అల్లాడుతున్న కామారెడ్డి జిల్లాలో(Kamareddy )ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. వరద ముప్పు నుంచి ప్రజలు కోలుకోవడం కష్టతరమైంది. ఏకధాటిగా వర్షం పడుతుండడంతో సర్వత్రా ఆందోళన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కామారెడ్డి జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు చెరవులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కాగా హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నిజామాబాద్- హైదరాబాద్ మార్గంలో కామరెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న కారణంతో పలు రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ను రద్దు చేయగా, నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను కాచిగూడ, కాజీపేట, పెద్దపల్లి, నిజామాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నారు.