PM Modi : మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మహిళలపై లైంగిక వేధింపులు, దాడులపై కఠినంగా వ్యవహరిస్తామని విస్పష్ట సంకేతం పంపారు. మహారాష్ట్రలోని జల్గావ్లో ఆదివారం లాఖ్పతి దీదీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం, బద్లాపూర్ స్కూల్లో లైంగిక వేధింపుల కేసుపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబికిన క్రమంలో మోదీ మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహిళలపై నేరాలు క్షమించరాని పాపమని ఆయన అభివర్ణించారు. మహిళల భద్రత, గౌరవం కాపాడే బాధ్యత సమాజం, ప్రభుత్వ బాధ్యతని ప్రధాని మోదీ గుర్తుచేశారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా తమ ప్రభుత్వం చట్టపరమైన భద్రత, యంత్రాంగాన్ని ప్రస్తుత చట్టాలకు సవరణల ద్వారా సమకూర్చిందని చెప్పుకొచ్చారు. గతంలో ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తేవని, ఇప్పుడు భారతీయ న్యాయసంహిత ద్వారా ఎన్నో సవరణలు తీసుకొచ్చామని వివరించారు.
ఎవరైనా మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు ఇష్టపడకుంటే ఆమె ఈ-ఎఫ్ఐఆర్ దాఖలు చేసే వెసులుబాటు ఉందని, ఈ-ఎఫ్ఐఆర్ను ఎవరూ ట్యాంపర్ చేయలేరని చెప్పారు. పెండ్లయిన అనంతరం మహిళలపై జరిగే నేరాలను ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనల కోసం ప్రస్తుత చట్టాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాల కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Read More :
Karnataka | పీకల్లోతు కేసుల్లో సీఎం సిద్ధూ.. కర్ణాటక కాంగ్రెస్లో వేగంగా మారుతున్న పరిణామాలు!