Karnataka | బెంగళూరు, ఆగస్టు 24: కర్ణాటక కాంగ్రెస్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు. ముడా, వాల్మీకి స్కామ్‌లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. దీంతో సీఎం పదవిపై కన్నేసిన నేతలు కుర్చీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన లేదా దింపేయాల్సిన పరిస్థితి వస్తే.. సీఎం కుర్చీని ఎవరికి అప్పగించాలనే దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్లాన్ బీ సిద్ధం చేస్తునట్టు తెలుస్తున్నది. సిద్ధరామయ్యకు తమ మద్దతు ఉంటుందని చెప్తూనే ప్రత్యామ్నాయ ప్రణాళికను రచిస్తున్నట్టు సమాచారం.
గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిపై పీటముడి పడింది. ఈ పదవికి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ చివరి వరకు పోటీ పడగా సిద్ధరామయ్య వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు, అధిష్ఠానం మొగ్గు చూపింది. డీకేకు ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టింది. ఇప్పుడు సిద్ధరామయ్య సీఎం పీఠం కోల్పోయే పరిస్థితి వస్తే డీకే శివకుమార్‌కే దక్కుతుందని అంతా ఊహిస్తున్న సమయంలో అనూహ్యంగా హోంమంత్రి జీ పరమేశ్వర పేరు తెరపైకి వచ్చింది.
దళిత నేత అయిన పరమేశ్వర పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నది. ఆయనను సీఎంను చేస్తే కర్ణాటకకు మొదటి దళిత ముఖ్యమంత్రి అవుతారు. ‘నేను రాజకీయాల్లో ఉన్నాను. నేనేమీ సన్యాసిని కాను సీఎం పదవిని ఆశించకపోవడానికి’ అంటూ ఈ పరిణామాలపై పరమేశ్వర స్పందించారు.
సీఎం పదవి కోసం డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యులంతా ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌ను కలిశారు. సిద్ధరామయ్య కర్ణాటక తిరిగి వచ్చినా డీకే మాత్రం ఢిల్లీలోనే మంత్రాంగం నడుపుతున్నారు. అయితే, ఈసారి కూడా డీకేకు కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయనకు సీఎం పదవి ఇచ్చేందుకు సిద్ధరామయ్య వర్గం వ్యతిరేకంగా ఉంది. సీనియర్ నేత సతీశ్ జార్కిహోళి సైతం శివకుమార్‌ను వ్యతిరేకిస్తున్నారు. వీరంతా ముఖ్యమంత్రిని మార్చొద్దని అంటున్నారు.
ఒకవేళ మార్చాల్సి వస్తే శివకుమార్ బదులు జీ పరమేశ్వర పేరును ప్రతిపాదించేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే జరిగితే డీకేకు మళ్లీ చుక్కెదురయ్యే చాన్స్ ఉంది. ఈ పరిణామాలపై కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక స్పందిస్తూ.. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం మ్యూజికల్ చైర్స్ ఆట మొదలయ్యిందని ఎద్దేవా చేశారు.