కోల్కతా : బొగ్గు, ఇసుక మాఫియాను కాపాడుతోంది ఎవరో బెంగాల్ ప్రజలకు తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పురూలియాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. పురూలియాలో నీటి సంక్షోభానికి పాలక తృణమూల్ కాంగ్రెస్ నిర్వాకాలే కారణమని మండిపడ్డారు.
ఎనిమిదేండ్ల కిందట మంచినీటి పైప్లైన్ నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తికాలేదని అన్నారు. బెంగాల్లో బీజేపీ అధికార పగ్గాలు చేపడితే అందరికీ పని కల్పిస్తామని, ప్రతిఒక్కరూ ఎదిగేందుకు అవకాశాలను ముందుకుతెస్తామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టోను మమతా బెనర్జీ విడుదల చేసిన మరుసటి రోజే ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.