హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ నియంత హిట్లర్ నుంచి తాను స్ఫూర్తి పొందానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆ వ్యాఖ్యలు ఆయనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలు, ఫాసిస్టు భావజాలాన్ని బయటపెట్టాయని కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో పేదల ఇండ్లను కూల్చేందుకు చేపట్టిన హైడ్రా ప్రాజెక్టును.. హిట్లర్ స్ఫూర్తితో చేపట్టినట్టు రేవంత్ చెప్పుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలపై దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సమాధానం చెప్పి తీరాలని సోమవారం ఎక్స్ వేదికగా విజయన్ డిమాండ్ చేశారు.
తన బుల్డోజర్ రాజ్‌ను సమర్థించుకొనేందుకు హైడ్రా గురించి బహిరంగంగా గర్వంగా భావిస్తున్నట్టు పేర్కొనడం గర్హనీయమని పేర్కొన్నారు. హింస, నిరంకుశత్వానికి కేంద్ర బిందువైన ఓ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకొని, ప్రజాస్వామ్య దేశంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బహిరంగంగా మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నోరు జారడమే కాదని, ఇది కాంగ్రెస్ అంతర్గత క్యారెక్టర్‌ను బయటపెడుతుందని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిపట్ల ప్రజాస్వామిక వాదులు జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు. హిట్లర్‌ను స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు చేసినట్టు రేవంత్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
హిట్లర్ వ్యాఖ్యలతో సీఎం రేవంత్ నోరు జారడమే కాదని, కాంగ్రెస్ అంతర్గత క్యారెక్టర్‌ను బయటపెట్టిందని పినరయి విజయన్ పేర్కొన్నారు. హిట్లర్‌ను కీర్తిస్తున్న రీతిలో కాంగ్రెస్ సీఎం మాట్లాడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. రేవంత్‌కు గతంలో సంఘ్‌పరివార్‌తో లింకులు ఉన్నాయని, ఆ ప్రభావం కూడా రేవంత్ వ్యాఖ్యల్లో ప్రస్ఫుటమైందని తెలిపారు. సీఎం వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎప్పటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించలేదన్న అంశాన్ని తేటతెల్లం చేసిందని తెలిపారు.