బయ్యారం, జనవరి 11 : భూ భారతి ఆపరేటర్లకు వేతనాలందక పండుగ పూటా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాదిన్నరగా జీతాలు పెండింగ్‌లో ఉండడంతో ఇల్లు గడువక ఆర్థికభారంతో సతమతమవుతు న్నారు. నెలనెలా ఇంటి ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తున్నదని మనోవేదనకు గురవు తున్నారు. కాంగ్రెస్ సర్కారు తమను క్రమబద్ధీకరిస్తామని మాటిచ్చి తప్పిందని ఆవేదన చెందుతున్నారు. పండుగ పూటైనా ప్రభుత్వం కనికరిస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
భూముల క్రయవిక్రయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తహసీల్దార్లకు అప్పగించింది. భూముల క్రయ విక్రయాల ఒప్పంద పత్రాలు తయారు చేసేందుకు ప్ర త్యేకంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆపరేటర్లను నియమించారు. ప్రతి తహసీల్‌లో ఓ ఆపరేటర్ (ఫీ ల్డ్ లెవల్ టెక్నికల్స్టాఫ్)తో పాటు వీరిని సమన్వయ పరిచేందుకు జిల్లా స్థ్ధాయిలో ఓ కోఆర్డినేటర్, ఇద్దరు సహాయ ఆపరేటర్లను నియమించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీరు 89 మంది ఉండగా, వరంగల్ లో 15, హనుమకొండలో 17, మహబూబాబాద్‌లో 19, జయశంకర్ భూపాలపల్లిలో 13, ములుగులో 11, జనగామలో 14 మంది ఉన్నారు. ఆపరేటర్లకు నెలకు రూ.11,583, సమన్వయకర్తలకు రూ.13,98 2 వేతనం ఇస్తుండగా, ఏడాదిన్నరగా వేతనాలు రాక పోవడంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతినెలా ఇల్లు గడవడం కోసం తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, ఓ వైపు పని ఒత్తిడి.. మరో వైపు ఆర్థిక భారంతో మనోవేదన చెందుతున్నారు. సంక్రాంతి వేళ అ యినా వేతనాలు అందించాలని కోరుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ-సెంట్రిక్ అనే ఏజెన్సీ ద్వారా నియమించిన ధరణి ఆపరేటర్లకు ప్రతి మూడు నెలలకొకసారి వేతనాలు క్రమం తప్పకుండా అందేవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి భూ భారతిగా నామ కరణం చేసినప్పటికీ వారినే కొనసాగిస్తున్నారు. అయితే పాత ఏజెన్సీని తొలగించిన కాంగ్రెస్ సర్కారు కొత్త ఏజెన్సీని మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో వేతనాలు అందడం లేదు. ఎన్నికల సమయంలో ధరణి ఆపరేటర్లను క్రమబద్ధీకరిస్త్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు దాన్ని మరిచింది. నిర్ధిష్టమైన వేతనాన్ని కొత్త ఏజెన్సీ ద్వారా అందిస్తామని మూడు నెలల క్రితం సీసీఎల్ఏ నుంచి ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం ఇంత వరకు వేతనాలు అందించక పోవడంతో ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.
ఏడాదిన్నరగా వేతనాలు అందకఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాం. ప్రతి నెలా ఇంటి ఖర్చుల కో సం అప్పులు తీసుకోవాల్సి వస్తుం ది. చాలీచాలని వేతనాలతో ఏండ్లు గా విధులు నిర్వర్తిస్తున్నా.. కనీసం ప్రయాణ ఖర్చులు లేక, ఇల్లు గడువక ఇబ్బందిగా మా రింది. పండుగ వేళ వేతనాలందిస్తే సంతోషిస్తాం. ఇచ్చిన మాట ప్రకారం క్రమబద్ధీకరించి, సమస్యలు పరిష్కరించాలి.
– ఐ. ఉదయ్, ఎఫ్టీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, మహబుబాబాద్