విజయనగరం16వ శతాబ్దం నాటి మహా సామ్రాజ్యం.
బండి నారాయణ స్వామి 21వ శతాబ్దపు తెలుగు నవలా దిగ్గజం.
అటూ ఇటూ 500 ఏండ్ల ఎడం.
అయినా అలనాటి దృశ్యాలు ఇంత సజీవంగా ఎలా సాధ్యం?
బండి నారాయణ స్వామి పదార్థ నియమాలను, భౌతిక పరిమితులను జయించిన సృజనకారుడు. ఇంకేముంది. అలవోకగా తన రెకలు ఆర్చుకొని, ఆ రెకల మీద మనలను (పాఠకులను) కూర్చుండబెట్టి, 16వ శతాబ్దంలోకి తిరోగమించి, విజయనగర సామ్రాజ్యపు రాచరిక వైభవాన్ని.. అకడి జన జాతుల సామూహిక జీవన విశిష్టతను సజీవ దృశ్యంగా కంట చూపారు.
కడపటి యుద్ధం నవల అనటం కంటే..620పేజీల ఆదిహిందూ జనజాతుల చారిత్రక దృశ్యకావ్యం అనటం సమంజసం. వీరం, క్రోధం, మోహం, లోభం, శృంగారం, బీభత్సం, భయానక, అద్భుత రసాలు సమ్మిళితమై అద్వితీయమైన రసానుభూతిని కలిగిస్తుంది
రాచరిక చరిత్ర అంతా నెత్తుటి పొద్దుతోనే మొదలవుతుంది. నెత్తుట్లోనే పారాడి పారాడి నెత్తుటి చెమ్మతోనే ముగుస్తుంది. అట్లే.. నెత్తుటి పొద్దుతోనే కడపటి యుద్ధం తొలి పుట మొదలయ్యింది. ఏనుగు అంతటి అళియ రామరాయల వారి కథ నెత్తుటి ముద్దగానే ముగిసిపోతుంది. రాజులు.. కుట్రలు..కత్తులు.. నెత్తుర్లు.. కొత్తేమీ కాదు. కానీ నారాయణ స్వామి తనకే సొంతమైన అద్భుత కాల్పనిక శక్తితో ప్రతిపుటను దృశ్యాల దొంతరగా రూపొందించారు.
మహాభారతంలో ఎన్నిరకాల మనస్తత్వాలు గోచరిస్తాయో .. కడపటి యుద్ధ కావ్యంలో అంతకు మించిన వ్యక్తిత్వాలు అనుభవంలోకి వచ్చాయి. హంపణ్ణ యక్షిణి- ప్రేమ సల్లాపం. అలివేలు- శ్రీనివాసరెడ్డి భగ్న ప్రేమ విలాపం.. ఉపపతితో తెలుగుల మాధవుడు రెండవ భార్య కలాపం.. దేవదాసీ రత్నమాల పొందు కోసం కత్తి పట్టిన టిట్టిభశెట్టి వీరత్వం.. బానిస మహిళ కోసం శెట్టి ఉబలాటం. ముస్లిం పాదుషాల మత మర్మం.. గోలొండ సామ్రాట్ ఇబ్రహీం కుతంత్రం.. అళియ రామరాయల వారి రాజసం.. రాజకీయం.. ముస్లిం సైనికుల మతతత్వం.. ఎన్నని చెప్పను నవల నిండా సజీవపాత్రలే. మహాభారత కావ్యం హస్తినాపురం చక్రవర్తులు, రాజులు, సామంతులు, రాణివాసాల పాత్రలకు.. రాచరికపు కొలువు కూటాల మంత్రాంగాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులకే పరిమితమైంది. కానీ కడపటి యుద్ధం హంపి నగర రాజ సౌధాలను దాటుకొని పంచమవాడలోకి ప్రవేశించింది. అకడి నుండి తురకవాడకు..అట్లా ఏడు ప్రాకారాల నడుమనున్న ఒకో సామాజిక జన జాతుల సమూహాల జీవన పార్శ్వాన్ని తడిమి చూపించింది. అకలవాడన మద్యం తిత్తుల మైకం.. బానిస స్త్రీల వేలం.. భోగం సానులతో శృంగారం.. దేవదాసీ సౌధం.. అందలి గోడల మీద చిత్రకళా చాతుర్యం.. పోర్చుగీసు వారి వ్యాపారం.. ఎన్నని రాయను. ప్రతి పదసృష్టి ఒక అద్భుతమే. నవల ఆద్యంతం విసుగు, విరామం లేకుండా ఏకబిగిన చదివించింది.
“కవి కడు స్వతంత్రుడు. స్వతంత్ర వ్యక్తిత్వం వున్నవాడు. అందుకని వాస్తవికతను వాస్తవికతగా చెప్పడు. వాస్తవికతకు వ్యక్తిత్వంతో స్పందించి సృజించడమే కళ అని కవికి తెలుసు” అంటుంది భాగీరథి. ఈమె భోగం సాని కూతురు. అప్పటికి ఆమె గోలొండ యువరాజు ఇబ్రహీం ప్రేయసి. ఈ మాట ముమ్మాటికి ఈ నవల రచయిత బండి నారాయణస్వామి వ్యక్తిత్వమే.
చారిత్రక వాస్తవానికి సృజన జోడించి నిషర్షగా, నిర్మొహమాటంగా ఎత్తి చూపారు. మతం అప్రజాస్వామికమైనది అని తేల్చి చెప్తారు. అయితే సామాజికంగా, సాంసృతికంగా సమాజంలో సమ్మిళితమై ఉన్న మతపార్శ్వాన్ని తృణీకరించలేని నగ్న సత్యాన్ని ప్రతిభావంతమైన పాత్రల ద్వారా ఎత్తిచూపారు.
అనేక సజీవ పాత్రల నడుమ నా మనసుకు అద్భుతం.. అబ్బురం అనిపించిన అభినేతలు ఇద్దరు. ఒకరు ఉత్తణ్ణ. ఇంకొకరు నల్లజ్జ. పరస్పర విరుద్ధ స్వభావమున్న పాత్రలు. బండి నారాయణ స్వామి అద్భుత సృష్టికి ప్రతిరూపాలు.
ఉత్తణ్ణ.. ఉత్తముడు.. పంచముడు..చర్మకారుడు… నిర్వికారుడు.. జ్ఞాన సంపన్నుడు.. అన్నిటికీ మించి వీరవైష్ణవ భక్తి ఉద్యమకారుడు. ఈ పంచముని గుడిసెకు సాక్షాత్తు శ్రీరామ చంద్రుడే ఏతెంచి తన భక్తుడు హన్మంతునికి పాదరక్షలు కుట్టడం అనేది అనన్య సామాన్య కల్పన. పంచమున్ని అచంచలమైన దైవిక కొండ అంచున నిలబెట్టిన ప్రయత్నం. ఉత్తణ్ణ పాత్రలో నాకు సాక్షాత్తు బండి నారాయణ స్వామి గారు సాక్షాతరించారు. వారితో నాకు పరిచయ భాగ్యం బహు స్వల్పకాలమే కానీ, నిరాకారి వెర్రి తన్మయం ఏదో స్వామి గారి చుట్టూ ఆవహిస్తుంది అనిపించింది.
ఇంకొకరు నల్లజ్జ. నిర్లజ్జకు నిలువెత్తు రూపం. సకల కామానుభూతులకు కేరాఫ్ అడ్రస్. స్త్రీలోలుడు.. వ్యసనపరుడు..బోగ లాలసుడు.. జ్ఞాన హీనుడు..మహిళా వస్తాదు చినపోతి భర్త. వేశ్య ప్రాపాలిక ఇష్ట ప్రియుడు.
నల్లప్రజ నాయకుడు. నల్లప్రజ అంటే దొంగల దండు. యుద్ధానికి ముందు రాయలవారు శత్రు రాజ్య గ్రామాల మీద రాయలు ప్రయోగించే లూటీ ముఠా. నల్లజ్జ పాపభీతి, ప్రాణభయం లేని యోధుడు. ఈ మొండి తనమే ఆఖరి నిమిషంలో అతని ప్రాణం నిలిపింది.
‘అన్నమయ్య మన సంప్రదాయక ఆధ్యాత్మికతకు తన వ్యక్తిగత అనుభూతిని, అనుభవాన్ని జోడిస్తాడు. అతడు మొత్తం 89భిన్న స్వరరాగాలను ప్రయోగించి ఉంటారు’ అని అళియ రామరాయల వారు తన ఇష్టసఖి తిరుమలాంబకు వచించిన సందర్భం.. అనంతరం పుణ్య దంపతుల మధ్య సాగిన సాహితీ సంభాషణ నారాయణ స్వామి గారి సాహిత్య జ్ఞానానికి ప్రతిరూపం. దేవుడు.. దెయ్యం.. మత విశ్వాసాలు లేని హంపణ్ట ఆఖరికి దేవతా
విగ్రహాలను రక్షించే బాధ్యతలు మోయటం కొసమెరుపు. హిందూ ఆలయాల విధ్వంసకుడు, ముస్లిం యుద్ధ వీరుడైన రెహమాన్ హంపణ్టకు తోడు నిలబడటం కథలో మరో ట్విస్టు .గొప్ప చారిత్రక నవలకు జీవం పోసి నడిపించిన ఈ సాహితీ జ్ఞాని కృషి అపురూపం, అద్వితీయం అని చెప్పక తప్పదు.
-వర్ధెల్లి వెంకట్